Idli can cause cancer: దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశం అంతటా ప్రజలు ఇడ్లీలు అంటే ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఇప్పుడు ఇడ్లీ తినే వారు జాగ్రత్తగా ఉండాలి. ఇడ్లీలో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండటం ఇప్పుడు కర్నాటకలో కలకలం రేపింది. హోటళ్లలో ఇడ్లీలను తయారు చేసేటప్పుడు పాత్రలపై వస్త్రాన్ని కప్పి, దానిపై పిండి వేస్తుంటారు. అయితే కర్నాటకలోని పలు హోటళ్లలో వస్త్రానికి బదులు పాలిథీన్ షీట్లు వినియోగిస్తున్నారని ఇటీవల ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఆహార భద్రతశాఖ అధికారులు రాష్ట్రంలో 251 హోటళ్లపై దాడులు నిర్వహించి నమూనాలను సేకరించారు.
వీటిని పరీక్షించగా 52 హోటళ్లలో ఇడ్లీల తయారీకి ప్లాస్టిక్ వినియోగించినట్లు గుర్తించారు. ప్లాస్టిక్ లో ఉండే క్యాన్సర్ కారకాలు ఇడ్లీల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇడ్లీల తయారీకి ఎక్కడా పాలిథీన్ షీట్లు వాడొద్దని నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు గురువారం ప్రకటించారు.