Dandruff: చుండ్రు రావడానికి అసలు కారణం ఏంటి.? ఇంటి చిట్కాలతో ఎలా చెక్ పెట్టాలి.?
Dandruff: చుండ్రు సమస్య చాలా సాధారణం. ఇటీవల చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
Dandruff: చుండ్రు సమస్య చాలా సాధారణం. ఇటీవల చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చుండ్రు వల్ల తలపై తెల్లటి పొర ఏర్పడి, దురద పెరిగి, జుట్టు రాలిపోతుంది. మార్కెట్లో చుండ్రును తొలగించడానికి అనేక రకాల షాంపూలు, సీరమ్‌లు, నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటివల్ల ప్రయోజనంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే సహజ పద్ధతుల్లో కూడా చుండ్రుకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? ఇంతకీ చుండ్రు ఎందుకు వస్తుంది.? ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చుండ్రుకు కారణాలు..
తలపై చర్మం పొడిబారడం, తీవ్రమైన ఒత్తిడి బారినపడడం, జిడ్డు చర్మంపై దుమ్ము పేరుకుపోవడం, జుట్టును ఎక్కువసార్లు కడగడం లేదా మొత్తానికే శుభ్రం చేయకపోవడం. ఫంగల్ ఇన్ఫెక్షన్, రసాయన ఉత్పత్తుల అధిక వినియోగం, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని రకాల మందులను తీసుకోవడం వంటి కారణాల వల్ల తరచుగా చుండ్రు వస్తుంది. అయితే చుండ్రును చెక్ పెట్టేందుకే పాటించాల్సిన కొన్ని సహజ చిట్కాలు ఏంటంటే.
1. కొబ్బరి నూనె, నిమ్మకాయ
రెండు చెంచాల కొబ్బరి నూనెను సమాన పరిమాణంలో నిమ్మరసంతో కలిపి తలకు అప్లై చేయాలి. కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత, షాంపూతో జుట్టును శుభ్రంగా కడగాలి. ఇది చుండ్రును తొలగించడంతో పాటు తలకు తేమను అందిస్తుంది.
2. పెరుగు
పెరుగు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా మంచిది. ఇది చుండ్రును త్వరగా తగ్గించే సహజమైన మార్గం. పెరుగును తలకు బాగా అప్లై చేసి, ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇది తలకు తేమను అందించి, పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
3. వేప రసం
వేపలో ఉండే ఔషధ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వేప ఆకులను మెత్తగా రుబ్బి, రసం తీసి తలకు అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చుండ్రు తగ్గుతుంది.
4. నారింజ తొక్క, నిమ్మరసం
నారింజ తొక్కను గ్రైండ్ చేసి, అందులో కొంత నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు తగ్గుతుంది.
5. గ్రీన్ టీ
గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతో పాటు, తలకు అప్లై చేయడం ద్వారా చుండ్రును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 2 గ్రీన్ టీ బ్యాగులను వేడి నీటిలో నానబెట్టి, ఆ నీటిని చల్లబరచి తలకు అప్లై చేయాలి. కాసేపటి తర్వాత కడిగేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించనవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.