Lung Cancer Symptoms: పదేపదే దగ్గు, ఊపిరి ఆడడం లేదా.. అయితే ఆ క్యాన్సర్ కావొచ్చు

Lung Cancer Symptoms: దగ్గు రావడం ఒక సాధారణ లక్షణం. ఇది శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ఒక సహజ ప్రక్రియ. కానీ దగ్గు పదేపదే వస్తున్నా, లేదా చాలా కాలం పాటు తగ్గకుండా ఉన్నా, అది ఏదో ఒక జబ్బుకు సంకేతం కావచ్చు.

Update: 2025-07-06 07:33 GMT

Lung Cancer Symptoms: పదేపదే దగ్గు, ఊపిరి ఆడడం లేదా.. అయితే ఆ క్యాన్సర్ కావొచ్చు

Lung Cancer Symptoms: దగ్గు రావడం ఒక సాధారణ లక్షణం. ఇది శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ఒక సహజ ప్రక్రియ. కానీ దగ్గు పదేపదే వస్తున్నా, లేదా చాలా కాలం పాటు తగ్గకుండా ఉన్నా, అది ఏదో ఒక జబ్బుకు సంకేతం కావచ్చు. చాలా మంది దీన్ని వాతావరణం మారడం వల్లనో, జలుబు వల్లనో, గొంతు పాడవటం వల్లనో అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, పదే పదే దగ్గు రావడం సాధారణ కారణాల వల్లే కాకుండా, ఊపిరితిత్తులు, గుండె, అలర్జీలు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా సంకేతం కావచ్చు.

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలం పాటు కొనసాగే దగ్గు, కొద్దిగా ఆయాసం లేదా ఛాతీలో అసౌకర్యాన్ని వాతావరణం మార్పులు లేదా అలర్జీగా భావించి పట్టించుకోకుండా ఉంటాం. కానీ ఈ లక్షణాలు ఊపిరితిత్తుల తీవ్రమైన వ్యాధులకు, చివరికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కూడా ప్రారంభ సంకేతాలు కావచ్చు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల లక్షణాలు నెమ్మదిగా బయటపడతాయి, వాటిని గుర్తించడం తరచుగా కష్టమవుతుంది. అందుకే ఈ సంకేతాలను సమయానికి గుర్తించడం చాలా ముఖ్యం.

దగ్గు 2-3 వారాలకు మించి తగ్గకుండా ఉండి, మందులతో కూడా ఉపశమనం లభించకపోతే అది కేవలం జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు. దగ్గుతో పాటు తెమడలో రక్తం వస్తున్నా, లేదా మీ వాయిస్ మారుతున్నా అది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఇది ఊపిరితిత్తుల ఉపరితలంపై కణితి ఏర్పడటం వల్ల జరగవచ్చు. మెట్లు ఎక్కేటప్పుడు లేదా కొద్ది దూరం నడిచిన వెంటనే మీకు ఆయాసం వస్తున్నట్లయితే, ఇది బలహీనమైన ఊపిరితిత్తులకు సంకేతం. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఆస్తమా, లేదా ఊపిరితిత్తులలో కణితి వంటి కారణాల వల్ల ఇలా జరగవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలలో కూడా ఇదే లక్షణం కనిపిస్తుంది.

ఊపిరితిత్తుల వ్యాధులలో ఛాతీలో తేలికపాటి నొప్పి, మంట లేదా ఒత్తిడి అనిపించవచ్చు. ఈ నొప్పి నిరంతరం కొనసాగుతూ, ముఖ్యంగా దగ్గినప్పుడు లేదా శ్వాస తీసుకున్నప్పుడు పెరిగినట్లయితే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ లేదా క్యాన్సర్ లక్షణం కావచ్చు. పదే పదే తేలికపాటి జ్వరం వస్తున్నా, ఆకలి లేకపోయినా, శరీరంలో శక్తి లేకపోయినా, ఇది ఊపిరితిత్తులలో ఏదైనా అంతర్గత ఇన్ఫెక్షన్ ఉన్నట్లు సూచించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో ఈ లక్షణాలు నెమ్మదిగా పెరుగుతాయి.

ఎక్కువ కాలంగా పొగతాగేవారు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల వ్యాధి చరిత్ర ఉన్నవారు, 40 ఏళ్లు పైబడి, పదే పదే శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. CT-స్కాన్ , ఛాతీ ఎక్స్‌రే వంటి వాటి ద్వారా ఊపిరితిత్తుల పరిస్థితిని తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News