సత్తెనపల్లి సమరంలో విజయం ఎవరిది...అంబటి రాంబాబు చరిత్ర తిరగరాస్తాడా?

Update: 2019-04-26 08:26 GMT

అక్కడ ఓటు ఓటుకు ఒక్కో ఫైటు అన్నట్టుగా పోలింగ్ జరిగింది. ఎన్నికలా రెండు వర్గాల మధ్య యుద్ధమా అన్నట్టుగా సాగింది. తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. బట్టలు చింపుకున్నారు. కార్లు ధ్వంసం చేసుకున్నారు. చివరికి ఈ ఘర్షణకు కారణం, మీరంటే మీరంటూ ఆరోపించుకున్నారు. ఇంతటి రగడ ఎందుకంటే, ఆ నియోజకవర్గం, ఆ రెండు పార్టీలకు అత్యంత ప్రతష్టాత్మకం. అక్కడ గెలుపు ఇద్దరు అభ్యర్థులకు ప్రాణప్రదం. రాజకీయ జీవితంలోకి అత్యంత కీలకం. ఆ నియోజకవర్గం సత్తెనపల్లి. మరి సత్తెనపల్లి సమరంలో, గెలుపు బావుటా ఎవరిది కోడెలదా అంబటిదా పోలింగ్‌ జరిగిన తీరు చెబుతున్నదేంటి?

గుంటూరు జిల్లాలో అతి పెద్దదైన నియోజకవర్గం సత్తెనపల్లి. ఈ సెగ్మెంట్‌లో సతైనపల్లి పట్టణంతో పాటు, సత్తెనపల్లి రూరల్ మండలం, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, మండలాలు సత్తెనపల్లిలో ఉన్నాయి. పోలింగ్‌కు ముందు పోలింగ్ తర్వాత కూడా పతాక శీర్షికల్లో నిలిచింది సత్తెనపల్లి. ఎందుకంటే, ఇక్కడ కీలకమైన నాయకులు హోరాహోరిగా తలపడ్డారు.

జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న డాక్టర్ కోడెల శివప్రసాద్, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, 934 ఓట్లతో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై గెలుపొందారు. అసెంబ్లీ స్పీకర్‌గా కోడెల శివప్రసాద్ బాధ్యతలు నిర్వర్తించారు. మరోసారి సత్తెనపల్లి సమరంలో, అంబటి రాంబాబుతో తలపడ్డారు. ఈ ఇద్దరి మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే, పోలింగ్‌ టైంలో రెండు వర్గాలు కొట్టుకునేంతగా.

రాజుపాలెం ఇనిమెట్ల పోలింగ్‌ బూత్‌లో జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లిన తనను అంబటి వర్గీయులు కొట్టారని, చొక్కా చింపారని కోడెల ఆరోపించారు. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని కోడెల రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన వైసీపీ, సానుభూతి కోసం ఇదంతా చేశారని తిప్పికొట్టింది. దాడి చేసిన తర్వాత కూడా పగిలిపోయిన కారుతో, చినిగిపోయిన చొక్కాతోనే కోడెల శివప్రసాద్ 40 గ్రామాల్లో, ఎన్నికల సరళిని పరిశీలించుకుంటూ పర్యటించారు. వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో కోడెలపై సానుభూతి పెరిగిందని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఇదే రేపటి గెలుపుకు సోపానమంటున్నారు. అయితే ప్రజా తిరుగుబాటుకు ఇదే నిదర్శనమంటున్నారు వైసీపీ నేతలు.

ఈ ఎన్నికల్లో సత్తెనపల్లిలో మొత్తం ఓటర్లు 2,30,775 మంది. ఓట్లేసినవారు 2,01,894 మంది. అంటే 87.49 శాతం ఓటింగ్ నమోదైంది. అంటే 2014తో పోలిస్తే, 2.93 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. పెరిగిన ఓటు ఎవరికి చేటు తెస్తుందో, ఎవరికి మేలు చేస్తుందోనని, అభ్యర్థులు కంగారు పడుతున్నారు. సత్తెనపల్లిలో కోడెల ఆయన కుమారుడు, కుమార్తెల అవినీతి పెరిగిపోయిందని, ప్రజలు విసిగిపోయి ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అదే తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. అటు తెలుగుదేశం కూడా అనేక రకాలుగా దీమాగా ఉంది. అంబటి స్థానికేతరుడుని, 2014 ఓటమి తర్వాత అసలు అడ్రస్‌లేని అంబటి, మళ్లీ ఎన్నికలకు ప్రత్యక్షమయ్యాడని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. తిరుగులేని నేతగా పేరున్న కోడెల విజయం తప్పదని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇలా ఎవరి దీమా వారిదే. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, సత్తెనపల్లి హోరాహోరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారోనని రాష్ట్రమంతా ఉత్కంఠగా చూస్తోంది.

Full View 

Similar News