పిఠాపురం సంస్థానంలో ఎగిరేది ఎవరి జెండా?

Update: 2019-04-23 07:12 GMT

పిఠాపురం రాజెవరు ఆ సంస్థానాన్ని చేజిక్కించుకునేదెవరు పిఠాపురం కోటను తెలుగుదేశం తిరిగి నిలబెట్టుకుంటుందా వైసీపీ విజయపతాకను ఎగరేస్తుందా లేదంటే జనసైనికుడు జెండా పాతుతాడా ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పిఠాపురంలో ఇప్పుడు ఎవరిని కదిపినా ఇదే చర్చ, ఇవే సంభాషణలు. అయితే అర్థరాత్రి తర్వాత కూడా ఓటేసిన జనం మదిలో నిలిచింది ఎవరు మిడ్‌నైట్‌ వరకు వారిని పోలింగ్‌ బూత్‌లో నిలబెట్టిన స్ఫూర్తి ఏంటి? ఎవరిని గెలిపించాలని కంకణం కట్టుకున్నారు?

పిఠాపురం. తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోకవర్గాల్లో ఒకటి. తీరప్రాంతం కానీ ఈసారి జరిగిన సార్వత్రిక సమరం, ఇక్కడ రసపట్టులా సాగింది. ఏలేరు ప్రాజెక్ట్ చిట్టచివరన ఉండే నియోజకవర్గం పిఠాపురం. ఈ సెగ్మెంట్‌లో వ్యవసాయాధారిత మండలైన పిఠాపురం, గొల్లప్రోలులో కమర్షియల్ క్రాప్స్ కు రైతులు మొగ్గు చూపిస్తుంటారు. అయితే ఏలేరు ప్రాజెక్ట్ లో నీటి లభ్యత తక్కువగా ఉండడం, మరోవైపు ఎగువ ప్రాంతంలో ఉన్న సుద్దగడ వాగుకు వచ్చే వరదలతో అక్కడి రైతాంగం తీవ్ర నష్టాల బారిన పడుతూ ఉండేవారు. 2014 ఎన్నికల తరువాత పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏలేరు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోగా, సుద్దగడ వాగును సైతం ఆధునీకరించడంతో రైతుల కష్టాలకు చెక్ పడింది.

మరోవైపు ఈ నియోజకవర్గంలో ఉన్న తీర ప్రాంతం, తరచూ సంభవించే తుఫానుల వల్ల కోతకు గురికావడం, కోతకు నిరోధించేందుకు శాస్వత పరిష్కార మార్గం చూపించకపోవడంతో ఉప్పాడ కొత్తపల్లి మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో ప్రధాన సమస్య కాకినాడ ఎస్ఈజడ్. సెజ్ ఏర్పాటు చేసి 13 ఏళ్లు గడుస్తున్నా ఆశించిన స్ధాయిలో పరిశ్రమలు రాకపోవడం సెజ్ బాధిత రైతులు గుర్రుగా ఉన్నారు. ఇలా అనేక సమస్యలను ఎత్తిచూపుతూ సాగింది పిఠాపురం అసెంబ్లీ సమరం. అన్ని పార్టీల అభ్యర్థులు వీటి పరిష్కారానికి హామీలిచ్చారు.

ఇక ఈ నియోజకవర్గంలో ప్రధాన సామాజికవర్గంగా ఉన్న కాపులు, ఆ తరువాత స్ధానం బిసిల్లో శెట్టిబలిజలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు. 2014 ఎన్నికల్లో నియోజకవర్గంలో 1లక్ష 91 వేలుగా ఉన్న ఓటర్లు, 2019 ఎన్నికలకు వచ్చేసరికి 2లక్షల 30 వేలకు పెరిగారు. తాను చేసిన అభివృద్ధే విజయానికి బాటలు వేస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ దీమాగా ఉంటే, ప్రభుత్వంపై వ్యతిరేకత, కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ అభ్యర్ధి కావడంతో కాపులంతా తనవైపే అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు పెండెం దొరబాబు. ఇక జనసేన సైతం రాజకీయాల్లో సమూల మార్పులు అనే అంశంతో పాటు కాపు సామాజకివర్గానికి చెందిన మహిళ కావడం తనకు ప్లస్ పాయింట్‌గా భావిస్తున్నారు మాకినీడి శేషుకుమారి. వీరిలో ఎవరిపై ఓటర్లు మొగ్గుచూపించారో తెలియాలంటే, మే 23 వరకు వేచి చూడాల్సిందే.

Similar News