ఉత్కంఠగా మైలవరం పోటీ..పోలింగ్‌ సరళిపై ఎవరికి వారే దీమా...

Update: 2019-04-26 09:50 GMT

మైలవరం. కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం. కానీ అక్కడ పోరు మామూలుగా సాగలేదు. మంత్రి వర్సెస్ మాజీ మంత్రి కుమారుడు. నువ్వానేనా అన్నట్టుగా పోటీపడ్డారు. వాళ్లెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, మరొకరు వసంత కృష్ణ ప్రసాద్. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. ధనబలంలోనూ, అంగబలంలోనూ ఒకరికొకరు తీసిపోరు. అందుకే మైలవరంలో, హోరాహోరి యుద్ధం సాగింది. మరి ఓటింగ్ సరళిపై ఎవరేం అనుకుంటున్నారు గెలుపు దీమాకు వాళ్లకు వాళ్లు చెప్పుకుంటున్న రీజన్స్ ఏంటి?

దేవినేని ఉమ, వెంకట కృష్ణ ప్రసాద్‌ మధ్య ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ వైరం సాగుతోంది. నందిగామ జనరల్‌ స్థానంలో, 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను 23 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు ఉమ. 2004 ఎన్నికల్లో తండ్రి వసంత నాగేశ్వరరావే కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగారు. దేవినేనికి గట్టి పోటీ ఇచ్చినా పరాజయం పాలయ్యారు. నాటి రాజకీయ వైరం ఇంకా కొనసాగుతోంది. కాలక్రమంలో నందిగామ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారడంతో, దేవినేని మైలవరం స్థానాన్ని ఎంచుకుని 2009, 14ల్లో విజయం సాధించారు. దేవినేనిని ఢీకొట్టే నేత కోసం అన్వేషించిన వైసీపీకి, వసంత నాగేశ్వర రావు కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ కనిపించారు. ఆరు నెలల ముందే రంగంలోకి దించింది. ప్రతీకారంతో రగిలిపోయిన కృష్ణ ప్రసాద్‌, ఊరూరా ప్రచారం హోరెత్తించారు.

ఈ ఎన్నికల్లోనూ పోరు ఉత్కంఠగా సాగింది. నువ్వానేనా అన్నట్టుగా దేవినేని, కృష్ణప్రసాద్‌ పోటీపడ్డారు. తెల్లవారు జామున నాలుగున్నర వరకూ, పోలింగ్ జరిగిందంటే, మైలవరం ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకమో, జనం కూడా ఎంత పట్టుదలగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మైలవరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 80 వేల 492. 2014 ఎన్నికల్లో మైలవరంలో పోలింగ్‌ శాతం 85.61.2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం 83.47. దాదాపు రెండు శాతం ఓటింగ్ తగ్గింది. తగ్గిన ఓటింగ్ ఎవరికి షాక్ ఎవరికి బ్రేక్ ఓటరన్న తీర్పు ఏమిచ్చాడన్నది నియోజకవర్గంలో ఉత్కంఠగా మారింది.

నీటి పారుదల శాఖామంత్రిగా దేవినేనికి జనంలో మంచి పేరుందని, ఆయన అభిమానులు అంటున్నారు. అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, పెన్షన్ వంటి పథకాలకు భారీ స్పందన వచ్చిందని, ఆ స్పందన ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని టీడీపీ నేతలు లెక్కలేస్తున్నారు. అటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ కూడా అంతే దీమాగా ఉన్నారు. దేవినేని అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయని, అందుకే జనం కసిగా ఓట్లేశారని చెబుతున్నారు. ఓట్లేసిన ఎవరిని అడిగినా ఇదే చెబుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థుల దీమాకు కారణాలివి. మరి జనం తీర్పు ఎలా ఉందో?

మైలవరంలో హోరాహోరి సమరం ఎవరు ఓడుతారో, ఎవరు గెలుస్తారో ఎవరికీ అర్థంకావడం లేదు. మంత్రి దేవినేని ఉమకు తిరుగులేదని చెప్పినా, ఓటింగ్ సరళి మాత్రం ఎందుకో వైసీపీ తనకే అనుకూలమని చెప్పుకుంటోంది. మరి వీరిలో ఎవరి దీమా నిజమవుతుందో ఎవరిది తేలిపోతుందో ఫలితాల రోజే తేలిపోతుంది. 

Full View


Similar News