ప్రత్తిపాడులో పవర్‌ ఎవరిది?

Update: 2019-05-16 06:57 GMT

తూర్పుగోదావరి జిల్లాలో సంచలనాల నియోజవర్గం ప్రత్తిపాడు. కాపుల ఉద్యమం, ముద్రగడ పద్మనాభం దీక్ష, ఇలా ఎందరో ధీటైన నాయకులు, మరెన్నో అలజడులకు కేరాఫ్‌ ప్రత్తిపాడు.ముద్రగడ కుటుంబం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో, మరో రెండు కుటుంబాలు రంగంలోకి దిగాయి. నువ్వానేనా అన్నట్టుగా అస్త్రశస్త్రాలు సంధించాయి. మరి ప్రత్తిపాడులో పవర్‌ ఎవరిది?

ప్రత్తిపాడు నియోజకవర్గం అంటేనే మూడు కుటుంబాల కథ.ఈ ఆరున్నర దశాబ్దాల కాలంలో ఎమ్మెల్యేలుగా అక్కడ గెలుపొందిన వారు ఆ మూడు కుటుంబాల వారే. ముందుగా ముద్రగడ కుటుంబం ఆరు పర్యాయాలు, పర్వత కుటుంబం నాలుగుసార్లు, వరుపులు కుటుంబం మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ముద్రగడ కుటుంబం పక్కకు జరిగితే, పర్వత-వరుపుల కుటుంబాల మధ్య సమరం సాగింది.

తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సోదరుడు మనవడైన వరుపుల రాజా బరిలో ఉంటే, పర్వత వంశీకుడు పూర్ణ చంద్ర ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరి మధ్య జనసేన నుంచి పరుపుల కుటుంబానికి చెందిన తమ్మయ్య బాబు రంగంలోకి దిగారు. అయితే పోటీ టిడిపి వైసిపి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సుబ్బారావు మనవడు వరుపుల రాజా తాతకు అన్నీ తానే చందంగా తొలి నుంచి నియోజకవర్గంలో చక్రం తిప్పారు. డిసిసిబి ప్రెసిడెంట్‌గా రాష్ట్ర ఆప్కో బోర్డు చైర్మన్‌గా, తనదైన శైలిలో టిడిపిలో బడా నేతలందరికి దగ్గరయ్యారు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా టిడిపి టికెట్‌ను దక్కించుకున్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. పర్వత కుటుంబానికి చెందిన పూర్ణ చంద్ర ప్రసాద్ జగన్ ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా బరిలోకి విస్తృత ప్రచారం చేశారు. కొన్నేళ్లుగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కూడా వైసిపిలో చేరి పూర్ణచంద్రప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జగన్‌ హవాతో పాటు పర్వత కుటుంబానికి ఉన్న పరపతి తనను గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు వైసిపి అభ్యర్ధి పూర్ణచంద్రప్రసాద్.

మరోపైపు టిడిపి చేసిన అభివృద్ధితో పాటు నియోజకవర్గంలో తాను స్ధాపించిన ట్రస్ట్ సేవలతో ప్రజలు తనకు పట్టకడతారని టిడిపి అభ్యర్ధి వరుపుల రాజా భావిస్తున్నారు. ఏలేరు ఆయకట్టు ప్రాంతమైన ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల రెండు వేల 743 మంది ఓటర్లుండగా, లక్షా 64 వేల 60 ఓట్లు పోలయ్యాయి. 80.92 శాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నియోజవర్గంలో సుమారు 40వేల వరకు కాపు సామాజికవర్గ ఓటర్లు ఉండగా, మరో 40 వేల వరకు యాదవ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉంది. ఇతర బీసీ సామాజికవర్గం మరో 30 వేలు. ఎస్సీ ఓటర్లు 35 వేలు. ఈ సామాజిక లెక్కలపైనే కసరత్తు చేసిన టీడీపీ, వైసీపీలు గెలుపు తమదంటే, తమదంటూ కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. సంచలనాలకు మారుపేరైన ప్రతిప్తాడులో ఈసారి గెలిచేది ఎవరో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

Full View

Similar News