రసవత్తరంగా పల్లెపోరు

ఇవాళ్టి నుంచి పంచాయితీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే, మొదటి విడతలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సెకండ్ ఫేజ్ లోనూ ఇదే స్థాయిలో నామినేషన్ల వచ్చే అవకాశ ఉంది.

Update: 2019-01-11 03:45 GMT
panchayat election

ఇవాళ్టి నుంచి పంచాయితీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే, మొదటి విడతలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సెకండ్ ఫేజ్ లోనూ ఇదే స్థాయిలో నామినేషన్ల వచ్చే అవకాశ ఉంది. ఆశావాహులు భారీగా పెరగడంతో కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలే సర్పంచి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో రెండో వితడ నామినేషన్ల పర్వం ప్రారంభంకావడంతో పల్లెల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. మేజర్‌ పంచాయతీలు, ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నవాటితో పాటు రియల్ ఎస్టేట్, పరిశ్రమలకు ప్రాధాన్యం ఉన్న పంచాయతీల్లో ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. సర్పంచ్ లతో పాటు ఉపసర్పంచ్ స్థానాలను ఆశించేవారి సంఖ్య భారీగా పెరగడం, పోటీ తీవ్రంగా కావడంతో పలు పంచాయతీల్లో ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్లను తలపిస్తున్నాయి.

ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగియడం, ఆ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన వారే సర్పంచి స్థానాలను ఆశించడంతో చాలాచోట్ల ఎమ్మెల్యేలే రంగంలోకి దిగారు. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని చాలా పంచాయతీల్లో అభ్యర్థులను ఎమ్మెల్యేలే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అత్యధిక పంచాయతీలను చేజిక్కించుకోవాలని కేటీఆర్ పిలుపునివ్వడంతో అధికార పార్టీ మద్దతుతో బరిలో దిగే సర్పంచి అభ్యర్థులను ఖరారు చేయడం నుంచి వారిని గెలిపించుకోవడం వరకు పార్టీ దృష్టి సారించింది. తమ పార్టీకి చెందినవారు ఎక్కువమంది బరిలో నిలిచినచోట నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఒక్కరే పోటీలో నిలిచేలా జిల్లా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు బరిలో నిలిచిన అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో వామపక్ష పార్టీలు కూడా పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారించాయి.

తొలివిడతలో నామినేషన్ల అనర్హతకు గురైనవారు ఇవాళ ఆర్డీవోకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఈనెల 13న ఉపసంహరణ పర్వం ఉంటుంది. రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న 4వేల 137 పంచాయతీలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 172 మండలాల్లో కొనసాగనున్న రెండో విడతలో 36వేల 620 వార్డులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఈ విడతకు 25వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.

మరోవైపు, నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాభివృద్ధి పనుల చెక్కులపై సంతకం చేసే అధికారం ఉప సర్పంచికి కూడా కల్పించారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచి పదవి కీలకంగా మారింది. రిజర్వేషన్లు అనుకూలించని నేతలంతా ఉప సర్పంచిగా ఎన్నికై, గ్రామాల్లో చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. ఉప సర్పంచి ఎన్నికలో సర్పంచి కూడా కీలకంగా మారనున్నారు. సర్పంచి ఎన్నిక రోజే, వార్డు సభ్యులు ఉప సర్పంచిని ఎన్నుకుంటారు. ఎక్కువ వార్డులు గెలుచుకున్న వర్గం ఉప సర్పంచి పదవిని పొందుతుంది. రెండు వర్గాలకూ సమానంగా వార్డు స్థానాలు వచ్చినప్పుడు సర్పంచి ఓటు నిర్ణయాత్మకమవుతుంది. ఈసారి మెజార్టీ పంచాయతీల్లో ఆశావాహుల సంఖ్య భారీగా ఉండటంతో పంచాయతీ పోరు ఆసక్తిగా మారింది.  

Similar News