కేరళలో మళ్లీ 'నిఫా వైరస్' కలకలం... ఓ వ్యక్తికి పాజిటివ్

Update: 2019-06-04 10:25 GMT

కొంత కాలం క్రితం కేరళను వణికించిన నిఫా వైరస్ మరోసారి పడగ విప్పుతోంది. 23 ఏళ్ల ఓ కాలేజీ విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లుగా ఆ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) సైతం ధృవీకరించిందని వెల్లడించారు. ఎర్నాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు శైలజ. నిఫా వైరస్ బాధితుడు ఇడుక్కిలోని తొడాపుళలో ఉన్న కాలేజీలో చదువుతున్నాడు. క్యాంప్‌లో భాగంగా ఇటీవల నాలుగు రోజుల పాటు త్రిస్సూర్‌కు వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అతడితో పాటు 16 మంది అక్కడ బస చేశారు. వారిలో ఆరుగురు విద్యార్థులు అతడిని నేరుగా తాకారని, అతి దగ్గరగా ఉన్నారని త్రిస్సూర్ జిల్లా మెడికల్ అధికారులు వెల్లడించారు. వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. గత ఏడాది మేలో కేరళలో నిఫా వైరస్ తీవ్ర అలజడి సృష్టించింది. ఆ మహమ్మారి సోకి 17 మంది చనిపోయారు.


 

Tags:    

Similar News