దర్శిలో గెలవాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే

Update: 2019-01-27 08:08 GMT

ఏపీలో అదో కాస్ట్లీ నియోజకవర్గం. అక్కడ గెలుపంటే కోట్లాది రూపాయల మాటే. పది, ఇరవై కోట్లు కాదు ఏకంగా వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టాలి. ప్రకాశం జిల్లాలోని దర్శికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోనే ఖరీదైన నియోజకవర్గంగా దర్శి పేరొందింది. దర్శి అసెంబ్లీ సీటు గెలువాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున శిద్దా రాఘవరావు, వైసీపీ తరుపున బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. ఇద్దరూ నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. శిద్దా రాఘవరావు గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.

రానున్న ఎన్నికల్లో పోటీ చేయను అని వైసీపీ అధినేత జగన్ కు బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దీంతో బాదం మాధవరెడ్డిని దర్శి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించగా, బలమైన అభ్యర్థి కాడనే పార్టీ వర్గాల అభిప్రాయంతో బుచేపల్లి శివప్రసాద్ రెడ్డితో జగన్ చర్చలు జరిపారు. తన బదులు మద్దిశెట్టి వేణుగోపాల్ కు టికెట్ ఇస్తే గెలిపించే పూచి తనది అని బుచేపల్లి శివప్రసాద్ జగన్ కు హామీ ఇచ్చారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో బుచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ సారి బూచేపల్లి వర్గం మద్దతుతో గెలుపు ఖాయం అనే ధీమాలో ఉన్నారు. దర్శి లో గెలపు, ఓటములు నిర్ణయించేందే డబ్బే అన్నది బహిరంగ రహస్యం. మద్దిశెట్టి వేణుగోపాల్ కి ఫార్మసీ, ఇంజినీరింగ్ కాలేజీలు,విదేశాల్లో వ్యాపారాలు ఉండగా, మంత్రి శిద్దా రాఘవరావు ప్రముఖ గ్రానైట్ వ్యాపారిగా పేరు ఉంది.

2014 ఎన్నికల కంటే ఈ సారి దర్శిలో ఎన్నికలు ఖర్చు ఎక్కువ కానుంది. టీడీపీ తరపున మరోసారి శిద్దా రాఘవరావుకు, వైసీపీ తరపున మద్దిశెట్టి వేణుగోపాల్ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో అభ్యర్థులు ఎవరున్నా ఎవరెన్నిఎక్కువ కోట్లు కుమ్మరిస్తే వారిదే దర్శిలో గెలుపన్నది జగమెరిగిన సత్యం.

Full View 

Similar News