టీ కాంగ్‌లో భగ్గుమన్న విభేదాలు...వర్గపోరుతో గాంధీభవన్‌ వేదికగా మాటల తూటాలు..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఓటమిపై సమీక్షా పేరుతో నిర్వహిస్తున్న సమావేశాలు రచ్చకెక్కాయి. అగ్రనేతలపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు సర్వే సత్యానారాయణ ఇష్టానుసారం చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ సీరియస్‌ అయ్యింది.

Update: 2019-01-07 04:03 GMT
sarvey sathyanarayana

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఓటమిపై సమీక్షా పేరుతో నిర్వహిస్తున్న సమావేశాలు రచ్చకెక్కాయి. అగ్రనేతలపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు సర్వే సత్యానారాయణ ఇష్టానుసారం చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ సీరియస్‌ అయ్యింది. ఆయన్ని సస్పెండ్‌ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల సమీక్షా సమావేశాలను సంచలన నిర్ణయంతో ముగించింది.

గాంధీ భవన్ వేదికగా పలువురు నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణకు కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. అధిష్టానంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారంటూ సర్వే సత్యనారాయణను పార్టీ నుంచిసస్పెండ్ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి నేతల మద్య మాటల యుద్ధం మొదలయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది. మల్కాజ్ గిరి నియోజకవర్గ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోయారు. కుంతియా, ఉత్తమ్ పై నిప్పులు చెరిగారు. ఉత్తమ్ ను ఇంకా పార్టీ భరించాలా పార్టీకి నష్టం చేసిన వాళ్లే మళ్లీ రివ్యూలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

సర్వే వ్యాఖ్యలను సమావేశంలో పాల్గొన్న నేతలు తప్పు బట్టారు. సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించినవారితో వాగ్వాదానికి దిగారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై వాటర్‌ బాటిల్‌ విసిరడంతో పాటు పార్టీ నేతలను విమర్శస్తూ సమావేశం మద్యలోనే వెళ్లిపోయారు. ఉత్తమ్‌, కుంతియా అసమర్ధతను ప్రశ్నిస్తే దాడులు చేయించడానికి గాంధీభవన్‌లో రౌడీలను పెట్టుకున్నారని ఆయన అన్నారు.

సర్వే సత్యనారాయణ వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సర్వే సత్యనారాయణకు అనేక సార్లు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి, పదవులు ఇచ్చినా సీనియర్ నేతలపై వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేయడం కాదు భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం పీసీసీలో ఎవరికీ లేదన్నారు సర్వే సత్యనారాయణ. తాను కేంద్ర మాజీ మంత్రిని సోనియాకు విదేయుడినన్నారు. పూర్తి ఆధారాలతో ఒకట్రెండు రోజుల్లో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు సర్వే.

మరో వైపు కొందరు నేతలు పొత్తులను తప్పుపట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుతో లాభం లేదన్నారు. కోమటిరెడ్డి పరిధి దాటి అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా మాట్లాడారంటూ తప్పు బట్టారు పార్టీ సీనియర్ నేత వీహెచ్. ఓటమిపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాలు కాంగ్రెస్ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టినట్లయ్యింది. పార్టీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి. 

Similar News