హస్తినలో ఆపరేషన్ ఆకర్ష్...బీజేపీలోకి సోనియా అనుచరుడు

Update: 2019-03-15 03:55 GMT

హస్తినలో ఆపరేషన్ ఆకర్ష్ సాగుతోందా? కాంగ్రెస్ కి సోనియాకు నమ్మిన బంటుగా ఉన్న టామ్ వడక్కన్ బీజేపీ కండువా కప్పుకోడం అదే అనుమానాలకు తావిస్తోంది. పైకి పుల్వామా ఎటాక్ పేరు చెబుతున్నా వడక్కన్ కు ఎంపీ కావాలన్న ఉబలాటమే పార్టీ మారేలా చేసిందని, అందుకు బీజేపీ పెద్దలు కూడా సహకరించారనీ తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీ స్థాయిలోనూ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోందా? కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుడి భుజం, ఆమె వ్యక్తిగత సలహాదారు, కాంగ్రెస్ ప్రతినిధి టామ్ వడక్కన్ కమలం తీర్ధం పుచ్చుకోడం చూస్తుంటే అదే అనిపిస్తోంది. దాదాపు 19 ఏళ్ల పాటూ సోనియా వెంటే ఉన్న వడక్కన్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రికి నమ్మిన బంటుగా ఉన్న ఆయన హటాత్తుగా బీజేపీ లో చేరడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరిచింది. కాంగ్రెస్ రాజకీయ దిగ్గజాల్లో పెద్ద వ్యక్తి కాకపోయినా ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అంతర్గత సర్కిళ్లలో ఆయన బాగా తెలిసిన వ్యక్తే.

తాను పార్టీ మారడానికి పుల్వామా దాడిపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరే కారణమని చెబుతున్నారు వడక్కన్. పాకిస్థాన్ ఉగ్రవాదులు మన భద్రతా దళాలపై దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ మన సర్కార్ నే తిట్టిపోసిందని దాంతో పార్టీని వీడటం మినహా మరో మార్గం లేకుండాపోయిందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన కొనసాగుతోందని దానికి విరుద్ధంగానే తాను బయటకు వచ్చాననీ అంటున్నారాయన. వడక్కన్ ఏం చెప్పినా ఆయన కేరళలో త్రిస్సూర్, ఎర్నాకుళం, ఇదుక్కిలలో ఎక్కడనుంచైనా పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్నది నిజం.. ఈ ప్రాంతాల్లో బీజేపీకి బలమైన కేండిడేట్లు లేనందున అమిత్ షా వలేసి పట్టుకున్నారన్న టాక్ నడుస్తోంది. కేరళ హిందూ, క్రిస్టియన్ యువతలో ఇస్లామిక్ ఛాందస వాదం పెచ్చరిల్లకుండా బీజేపీ సిరియన్ క్రిస్టియన్ చర్చితో కలసి ఒక ఫ్రంట్ గా ఏర్పడి పోరాడుతోంది. వడక్కన్ రాకతో కాంగ్రెస్ లో మరికొందరు సీనియర్లను బీజేపీ లాగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అహ్మద్ పటేల్ ను కూడా కాంగ్రెస్ నుంచి బయటకు రప్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కథనాలు వినిపిస్తున్నాయి.

Similar News