వైసీపీలోకి హాస్యనటుల వెల్లువ...ఏపీ ఎన్నికల్లో సినీ, బుల్లితెర నటుల హంగామా

Update: 2019-03-20 02:43 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్న ప్రతిపక్ష వైసీపీకి మద్దతుగా సినీనటుల వరద ప్రారంభమయ్యింది. హాస్యనటులు పోసాని, అలీ, పృథ్వీతో పాటు ఎమ్మెల్యే రోజా వైసీపీ ప్రచారకార్యక్రమాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.

ఏపీ ప్రస్తుత ఎన్నికల రాజకీయాలలో సినిమా నటుల సందడి గతం కంటే మరింత ఎక్కువయ్యింది. ఏపీ ప్రధానప్రతిపక్షం వైసీపీకి అండగా తెలుగు సినీరంగ హాస్యనటుల చేరిక జోరందుకొంది. ఇప్పటికే వైసీపీ నుంచి చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీ నటి రోజా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వరుసగా రెండోసారి గెలుపుతనదేనన్న ధీమాతో రోజా ఉన్నారు.

రోజాకు తోడుగా అన్నట్లు మాజీ ఎమ్మెల్యే జయసుధ, హాస్యనటులు పోసాని , పృథ్వీతో పాటు రాజా రవీంద్ర, దాసరి అరుణ్‌, పాతతరం సినీ హీరో భానుచందర్‌, వర్ధమాన నటులు కృష్ణుడు పార్టీలో చేరారు. సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ సైతం విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. వైసీపీ అధినేత జగన్ ను ముఖ్యమంత్రిగా చూడటమే తన లక్ష్యమని ఏమీ ఆశించకుండా విజయంకోసం తనవంతుగా ప్రచారం చేస్తానని శతసహస్ర సినీనటుడు అలీ అంటున్నాడు.

ఇక పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పి జనసేన పార్టీని స్థాపించడమే కాదు తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీ అధినేత హోదాతో పాటు ఎమ్మెల్యే గా భీమవరం, గాజువాక స్థానాల నుంచి పవన్ తన అదృష్టం పరీక్షించుకొంటున్నాడు. కాగా ఆయన సోదరుడు నాగబాబు వపన్‌ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు జబర్దస్త్‌ ఫేమ్‌, బుల్లితెర ప్రముఖ హాస్యనటుడు ఆది ఆ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటుండగా షకలక శంకర్‌ తదితరులు బహిరంగంగానే జనసేనకు మద్దతు తెలుపుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అయితే ఈ సినీనటులతో పార్టీలకు ఓట్లు ఏ మేరకు రాలుతాయి? సినీ, బుల్లితెర రంగాల నటులతో అధికారం సాధ్యమేనా? తెలుసుకోవాలంటే మరికొద్ది వారాలపాటు వేచిచూడక తప్పదు.

Similar News