నిషేధాన్ని తోసిరాజని సాగిన దేవరగట్టు కర్రల సమరం! ఇద్దరికి తీవ్ర గాయాలు!!

పోలీసులు ఎంతగా వారించినా.. ఎంత ప్రయత్నించినా దేవరగట్టు కర్రల సమరం కొనసాగింది. ఈ సమరంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మొత్తం 50 మంది గాయపడగా..ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు

Update: 2020-10-27 01:29 GMT

50 సిసి కెమెరాలు.. 30 చెక్ పోస్ట్ లు.. వేయికి పైగా పోలీసుల పటిష్ట పహారా.. ఇవేవీ వారిని ఆపలేకపోయాయి. సంప్రదాయంగా జరుపుకునే వేడుకను నిలువరించలేకపోయాయి. దాదాపుగా పదిరోజులుగా పోలీసులు చేసిన ప్రచారం ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఏటా జరిగే ఉత్సవం.. ప్రజల నమ్మకం..జరిపి తీరాలనే సంకల్పం.. అంతే దేవరగట్టు కర్రల సమరం విజయవంతంగా నిర్వహించుకున్నారు ప్రజలు.

ప్రతి ఏటా కర్నూలు జిల్లా దేవరగట్టు వద్ద దసరా సందర్భంగా జరుపుకునె కర్రల సమరం ఈ సంవత్సరమూ వేడుకగా నిర్వహించుకున్నారు. కరోనా ఇబ్బందుల నేపధ్యంలో పోలీసులు కొన్ని రోజులుగా ఈ ప్రాంతం అంతా నిషేధాజ్ఞలు విధించారు. 144 సెక్షన్ విధించి.. ప్రతి గ్రామంలోనూ ఎటువంటి పరిస్థితిలోనూ పండగ పేరుతొ గుమిగూడే పని చేయొద్దంటూ ప్రచారం చేశారు. నపోలీసుల నిషేదాజ్ఞల నడుమ ఈసారి ఉత్సవం జరగదని అనుకున్నారు అందరూ. కానీ, పోలీసులు కూడా ఊహించని విధంగా ప్రజలు తమ పండుగను నిర్వహించుకున్నారు.

ఎలా జరిగిందంటే..

సోమవారం రాత్రి 10:30 వరకూ అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. తేరు బజారు ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. తరువాత ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. రాత్రి వేగంగా నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సుళువాయి గ్రామాల ప్రజలు గట్టుకు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. ఆలయంలో అర్చకులు స్వామి కల్యాణోత్సవం నిర్వహించగా అనంతరం ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకువచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు. అక్కడి నుంచి భక్తులు విగ్రహాలకు కర్రలు అడ్డుగా ఉంచి రాక్షసపడ వద్దకు తీసుకువెళ్లారు. కర్రల సమరంలో 50 మంది గాయపడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

Tags:    

Similar News