US visa: భారతీయుల 2000 వీసా అపాయింట్‌మెంట్స్ రద్దు చేసిన అమెరికా.. కారణం ఏంటో తెలుసా.?
US visa: అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ముందుకు సాగుతోన్న ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
US visa: భారతీయుల 2000 వీసా అపాయింట్‌మెంట్స్ రద్దు చేసిన అమెరికా.. కారణం ఏంటో తెలుసా.?
US visa: అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ముందుకు సాగుతోన్న ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోసపూరిత కార్యకలాపాలను అడ్డుకునేందుకు అమెరికా దౌత్య కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో 2,000 వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు బుధవారం వెల్లడించింది. అవి అక్రమ పద్ధతుల్లో, ప్రత్యేకంగా ‘బాట్స్’ ద్వారా బుక్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్ వ్యవస్థలో భారీ లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అసలేం జరిగింది.?
వీసా అపాయింట్‌మెంట్ల కోసం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురు చూస్తుండగా, కొన్ని ఏజెంట్లు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ టూల్స్ (బాట్స్) ఉపయోగించి స్లాట్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. చట్ట వ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు అమెరికా కాన్సులర్ బృందం ఈ చర్యలు తీసుకుంది.
అధికారులు ఏమంటున్నారంటే..
తమ షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లను, ఫిక్సర్లను ఏమాత్రం సహించమని అమెరికా దౌత్య కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఈ 2,000 అపాయింట్‌మెంట్లను రద్దు చేయడమే కాకుండా, వాటికి అనుబంధ ఖాతాలను కూడా సస్పెండ్ చేస్తున్నామన్నారు. వీసా దరఖాస్తు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడానికి మోసపూరిత కార్యకలాపాలను నిర్మూలించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని ప్రకటించారు.
ఏజెంట్ల అక్రమ వ్యాపారం:
బీ1, బీ2, విద్యా, వ్యాపార వీసాలకు అపాయింట్‌మెంట్లు పొందడం చాలా కష్టమైన విషయం. కానీ ఏజెంట్ల ద్వారా ప్రయత్నిస్తే నెల రోజుల్లోనే స్లాట్ లభిస్తోంది. సాధారణంగా, దరఖాస్తుదారులు స్వయంగా అపాయింట్‌మెంట్ బుక్ చేయాలంటే సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అయితే ఏజెంట్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉపయోగించి స్లాట్లను ముందుగా బుక్ చేసుకొని, వాటిని రూ.30,000-35,000 వరకు వసూలు చేసి విక్రయిస్తున్నారు.
కఠిన చర్యలు:
వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్‌లో అవకతవకలను నివారించేందుకు అమెరికా ప్రభుత్వం గత కొంతకాలంగా కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో భారతీయులు వీసా కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చేది. అయితే మూడేళ్ల క్రితం ఈ సమస్యను భారత్ ప్రభుత్వం, అమెరికా దృష్టికి తీసుకెళ్లిన తర్వాత, సమయాన్ని గణనీయంగా తగ్గించారు. ఇప్పుడు ‘బాట్స్’ వినియోగాన్ని అడ్డుకోవడంపై మరింత దృష్టి సారించారు. ఈ చర్యతో నిజమైన దరఖాస్తుదారులకు మరింత సమర్థవంతమైన సేవలు అందే అవకాశముంది. అంతేకాకుండా, వీసా ప్రక్రియను మరింత పారదర్శకంగా, న్యాయంగా మార్చే దిశగా అమెరికా దౌత్య కార్యాలయం అడుగులు వేస్తోంది.