US Intensifies Retaliatory Strikes on Syria: సిరియాపై అమెరికా భీకర దాడులు.. ఐసిస్ రహస్య స్థావరాలు ధ్వంసం.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?
US Intensifies Retaliatory Strikes on Syria: సిరియాపై అమెరికా భీకర దాడులు.. ఐసిస్ రహస్య స్థావరాలు ధ్వంసం.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?
US Intensifies Retaliatory Strikes on Syria: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు 2026 జనవరి 10న అమెరికా సైన్యం సిరియా అంతటా భారీ వైమానిక దాడులు చేపట్టింది. ఐసిస్ ఉగ్రవాద లక్ష్యాలనే ఉద్దేశించి నిర్వహించిన ఈ దాడులకు “ఆపరేషన్ హాకీ స్ట్రైక్” అని పేరు పెట్టారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈస్ట్రన్ టైమ్ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు ఒకేసారి గాల్లోకి దూసుకెళ్లి, సిరియా వ్యాప్తంగా ఉన్న ఐసిస్ స్థావరాలపై కచ్చితమైన దాడులు చేశాయి. అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించి 35కు పైగా లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రకటించారు.
ఈ భారీ దాడులకు నేపథ్యం డిసెంబర్ 2025లో జరిగిన రక్తపాత సంఘటన. డిసెంబర్ 13న సిరియాలోని పాల్మైరా ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులు చేసిన దాడిలో అమెరికాకు చెందిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయోవా నేషనల్ గార్డ్‌కు చెందిన సార్జెంట్ ఎడ్గార్ బ్రియాన్ టొర్రెస్ టోవర్, సార్జెంట్ విలియం నాథనియల్ హోవార్డ్‌తో పాటు ఒక అమెరికన్ ఇంటర్‌ప్రెటర్ కూడా ఆ దాడిలో మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ఐసిస్ సంస్థే బాధ్యత వహించడంతో, ప్రతీకార చర్యగా డిసెంబర్ 19, 2025న అమెరికా “ఆపరేషన్ హాకీ స్ట్రైక్”ను ప్రారంభించింది. అప్పట్లోనే 70కి పైగా ఐసిస్ లక్ష్యాలను అమెరికా ధ్వంసం చేసింది. ఇప్పుడు జనవరి 10న జరిగిన దాడులు ఆ ఆపరేషన్‌కు కొనసాగింపుగా చేపట్టిన రెండో దశ దాడులుగా చెప్పవచ్చు.
అమెరికా అధికారులు స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే ఈ దాడులు పూర్తిగా ఐసిస్‌పైనే. తమ సైనికుల భద్రతను కాపాడుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా నిరోధించడమే లక్ష్యమని వారు అంటున్నారు. అయోవా రాష్ట్రాన్ని సాధారణంగా “హాకీ స్టేట్” అని పిలుస్తారు. అక్కడి నుంచి మరణించిన సైనికుల గౌరవార్థంగా ఈ ఆపరేషన్‌కు “హాకీ స్ట్రైక్” అనే పేరు పెట్టినట్లు సెంట్కామ్ వెల్లడించింది.
ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే డిసెంబర్ 2024లో సిరియాలో బషర్ అల్-అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కూడా అమెరికా ఐసిస్ వ్యతిరేక చర్యలను ఆపలేదు. పాల్మైరా దాడి అసద్ పతనం తర్వాత జరిగిన మొదటి పెద్ద ఐసిస్ దాడిగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న అమెరికా వైమానిక దాడుల టైమింగ్‌నే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఐసిస్ బలహీనపడిన దశలో, ఇంత భారీ స్థాయిలో ప్రతీకార దాడులు ఎందుకు? నిజంగా ఐసిస్ మాత్రమే లక్ష్యమా? లేక సిరియాలో కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వంతో సంబంధాలు, మధ్యప్రాచ్యంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడమే అసలు ఉద్దేశమా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
ఈ దాడులు జరుగుతున్న సమయంలో ప్రపంచం ఇప్పటికే ఉద్రిక్తతల అగ్నిగుండంలో ఉంది. వెనిజులాలో రాజకీయ అస్థిరత పెరుగుతోంది. ఇరాన్‌తో అణ్వస్త్ర ఒప్పందం అంశం మళ్లీ తీవ్ర వివాదంగా మారింది. సిరియాలో అసద్ పతనం తర్వాత కొత్త శక్తులు రంగప్రవేశం చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అమెరికాకు ఎదురుదెబ్బ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చైనా తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను మరింత ఉద్ధృతం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిసి అమెరికాకు వ్యతిరేకంగా ఒక కొత్త శక్తుల కూటమి ఏర్పడుతున్న సంకేతాలుగా విశ్లేషకులు చూస్తున్నారు.
ఇదే సమయంలో ట్రంప్ మరోసారి గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేశారు. జనవరి 2026లో ఆయన “గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలి, లేదంటే రష్యా లేదా చైనా అక్కడ పట్టు సాధిస్తాయి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కొనుగోలు ద్వారా సాధ్యపడకపోతే, కఠినమైన మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది” అని హెచ్చరించడం అంతర్జాతీయ వర్గాల్లో కలకలం రేపింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం కావడంతో, ఇది కూడా ప్రపంచ శక్తుల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.
ఈ అన్ని పరిణామాల మధ్య సిరియాలో జరిగిన తాజా అమెరికా వైమానిక దాడులు మరో పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే సంకేతాలా? నిపుణులు ఇప్పటికే 2026ను “ఉద్రిక్తతల సంవత్సరం”గా అభివర్ణిస్తున్నారు. ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం, తైవాన్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఘర్షణలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం పూర్తిస్థాయిలో మొదలుకాకపోయినా, కోల్డ్ వార్ తరహా ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది.