Denmark Warns US: ముందు కాల్పులు.. ఆ తర్వాతే ప్రశ్నలు! అమెరికాకు డెన్మార్క్ మాస్ వార్నింగ్

US-Denmark Standoff: అమెరికా అధ్యక్షుడి దూకుడు వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2026-01-09 06:29 GMT

US-Denmark Standoff: అమెరికా అధ్యక్షుడి దూకుడు వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత, అమెరికా తన దృష్టిని ఆర్కిటిక్ ప్రాంతంపై మళ్లించింది. గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలని అమెరికా చూస్తుండటంతో, డెన్మార్క్ యుద్ధానికి సై అంటోంది.

ముందు కాల్పులు.. తర్వాతే ప్రశ్నలు!

గ్రీన్‌ల్యాండ్‌ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే ఊరుకునేది లేదని డెన్మార్క్ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ సైన్యానికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే, పై అధికారుల అనుమతి కోసం వేచి చూడకుండా "ముందు కాల్పులు జరపండి.. ఆ తర్వాతే ప్రశ్నలు అడగండి" (Shoot first, ask questions later) అనే నిబంధనను రక్షణ శాఖ అమల్లోకి తెచ్చింది. ఇది కేవలం భూభాగ సమస్య మాత్రమే కాదని, అమెరికా దూకుడు నాటో (NATO) కూటమి మనుగడకే ప్రమాదమని హెచ్చరించింది.

డబ్బు ఎర వేస్తున్న అమెరికా?

గ్రీన్‌ల్యాండ్ ప్రజలను లోబర్చుకునేందుకు ట్రంప్ యంత్రాంగం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో కలవడానికి అక్కడి ప్రజలకు భారీగా నగదు ఆశ చూపుతున్నట్లు సమాచారం. ఒక్కో వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ఉనికి పెరగడం వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉందని, అందుకే గ్రీన్‌ల్యాండ్ తమకు అవసరమని ట్రంప్ వాదిస్తున్నారు.

డెన్మార్క్ ప్రధాని ఘాటు స్పందన

డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్ట ఫ్రెడరిక్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. "గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ భూభాగం.. ఇది అమ్మకానికి లేదు. మమ్మల్ని స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నమైనా నాటో పతనానికి నాంది అవుతుంది" అని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ఆర్కిటిక్ ప్రాంత భద్రతను కాపాడటంలో డెన్మార్క్ విఫలమైందని విమర్శించడం గమనార్హం.

Tags:    

Similar News