బ్రిటన్ రియల్ హీరో : 100 ఏళ్ల వయసులో రూ.264 కోట్ల విరాళాల సేకరణ..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి బ్రిటన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Update: 2020-04-25 01:53 GMT
UK Captain Tom (File Photo)

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి బ్రిటన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో వేలల్లో రికవరీ కేసులు ఉంటే ఇక్కడ మాత్రం వందల్లో ఉన్నాయి. దేశంలో కరోనా భారిన పడి 19,506 మంది మృతి చెందారు. ఈ క్రమంలో వందో ఏట అడుగుపెట్టబోతున్న ఓ వృద్ధుడు కరోనాపై పోరాటం కోసం 28 మిలియన్ పౌండ్లను ఛారిటీగా సేకరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు ఈ వయసులో గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నారు. ఆయనే బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికోద్యోగి కెప్టెన్ టామ్ మూరే.. బ్రిటన్ ను వణికిస్తున్న మహమ్మారికి కట్టడికోసం నేషనల్ హెల్త్ సర్వీస్ ఛారిటీలకి విరాళాలను సేకరించాలనే ఉంద్దేశ్యంతో ఏప్రిల్ 6న ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు టామ్ మూరే. సేకరించిన మొత్తాన్ని సపోర్టింగ్ స్టాఫ్, వాలంటీర్ల కోసం ఉపయోగించాలని సంకల్పించారు.

ఈ క్రమంలో వాకింగ్ ఫ్రేమ్‌ను ఉపయోగించి సుమారు 25 మీటర్ల పొడవు ఉన్న తన ఇంటి గార్డెన్ చుట్టూ "Tom's 100th Birthday Walk For The NHS" పేరిట రౌండ్లు వేసి వెయ్యి పౌండ్లు సేకరించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా రోజూ పది రౌండ్లు వేసేవారు.. ఈ క్రమంలో ప్రతిరోజు ఎంతో ఆత్మవిశ్వాసంతో వాకింగ్ ఫ్రేమ్‌ ద్వారా పది రౌండ్లు వేసి ఏప్రిల్ 16 నాటికి తన లక్షాన్ని చేరుకున్నారు. ఆ రోజుటికి మొత్తం 100 రౌండ్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి ఆందోళన చెందుతున్న వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం సింగర్ మైకెల్ బాల్‌తో కలిసి ఆయన 'యూ విల్ నెవర్ వాక్ ఎలోన్' అంటూ పాట కూడా పాడారు.. ఇప్పుడు ఇది బ్రిటన్‌ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంది.

యూకేలో ఎక్కడ చూసినా ఈ పాట హల్చల్ చేస్తోంది. వందేళ్ల వయసులో కూడా కరోనా కట్టడికోసం ఆయన పడుతున్న తపన చూసి పలువురు చారిటీ కోసం సహాయం అందించారు. శుక్రవారం నాటికి మొత్తం 28 మిలియన్ పౌండ్లు(రూ.264 కోట్ల) విరాళాల రూపంలో వచ్చాయి..దాంతో ఆయన 40 క్రితం నాటి రికార్డును బ్రేక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌లో చోటు సంపాదించారు. అంతే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2021 ఫ్రంట్ కవర్‌ ఫోటో కూడా ఆయనదే కావడం విశేషం. ఇక ఈ ఘనత సాధించిన టామ్ మూరే.. ఇది ఏప్రిల్ 30న 100వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న తనకు అద్భుతమైన గిఫ్ట్ గా భావించారు.


Tags:    

Similar News