Starvation: ‘ఏడిస్తే కన్నీళ్లు రావట్లేదు.. పిట్టల్లా రాలిపోతున్న చిన్నారులు’ – గాజాలో హృదయ విదారక పరిస్థితి
Starvation: ‘ఏడిస్తే కన్నీళ్లు రావట్లేదు.. పిట్టల్లా రాలిపోతున్న చిన్నారులు’ – గాజాలో హృదయ విదారక పరిస్థితి
గాజాలో పరిస్థితులు రోజురోజుకీ మరింత విషమిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలే. తినడానికి ఏమి దొరకక చిన్నారులు అలసిపోయి పిట్టల్లా రాలిపోతున్నారు. ఏడ్వడానికి కూడా శక్తి లేకపోవడం హృదయాన్ని కలచివేస్తోంది. పోషకాహార లోపంతో వందలాది మంది చిన్నారులు ఆసుపత్రుల దారిన పడుతుండగా, ఆహారం, ఔషధాల కొరతతో వైద్యులు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. గడిచిన కొన్ని రోజులుగా ఆకలితో మరణించే చిన్నారుల సంఖ్య పెరుగుతోందని స్థానిక వైద్యులు చెబుతున్నారు.
ఉత్తర గాజాలోని పేషెంట్స్ ఫ్రెండ్స్ ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉందని అమెరికా స్వచ్ఛంద సంస్థ వైద్యురాలు డాక్టర్ రానా సోహోబ్ తెలిపారు. రోజుకు 200-300 మంది చిన్నారులు ఆసుపత్రికి వస్తున్నారని, వారి శరీరాలు బక్కచిక్కి ఎముకలు మాత్రమే మిగిలిపోయాయని ఆమె వాపోయారు. “పిల్లలకు పోషకాహారం అందించలేకపోతున్నాం. పొటాషియం కొరతతో రానున్న రోజుల్లో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంది” అని ఆమె పేర్కొన్నారు.
లక్ష మందికి అత్యవసర చికిత్స అవసరం
ఐరాసకు చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) ప్రకారం, లక్ష మంది మహిళలు, చిన్నారులకు తక్షణ చికిత్స అవసరం. కీలకమైన చికిత్సలు ఆగిపోవడం, ఔషధాలు అయిపోవడంతో ఆకలితో చనిపోవడం ఆరంభమని మెడ్‌గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ జాన్ కహ్‌లెర్ హెచ్చరించారు.
గాజా ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, గడచిన మూడు వారాల్లో 48 మంది ఆకలి, పోషకాహార లోపంతో చనిపోయారు. వారిలో 20 మంది చిన్నారులు ఉండగా, ఐదేళ్ల లోపు పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఓసీహెచ్‌ఏ (OCHA) తెలిపింది.
ట్రక్కుల లూటీ.. ఆకలి చావుల భయం
ఐరాస అంచనా ప్రకారం, గాజా ప్రజలకు రోజూ 500-600 ట్రక్కుల ఆహారం అవసరం. కానీ ప్రస్తుతం రోజుకు 69 ట్రక్కులు మాత్రమే చేరుతున్నాయి. అయితే, ఆహారం కోసం అల్లాడుతున్న ప్రజలు ఈ ట్రక్కులను దోచుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆకలి చావులు మరింత పెరిగే అవకాశం ఉందని, అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి ఆహారం, ఔషధాలు సరఫరా చేయాలని 115 అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కోరాయి.