శ్రీలంకలో అడుగుపెట్టిన మాజీ అధ్యక్షుడు గొటబాయ.. స్వాగతం పలికేందుకు ఎగబడిన SLPP పార్టీ నేతలు

Gotabaya Rajapaksa: ఆ కుటుంబం అంటే.. ప్రజలు తోక తొక్కిన పాములా లేచేవారు.

Update: 2022-09-03 12:00 GMT

శ్రీలంకలో అడుగుపెట్టిన మాజీ అధ్యక్షుడు గొటబాయ.. స్వాగతం పలికేందుకు ఎగబడిన SLPP పార్టీ నేతలు

Gotabaya Rajapaksa: ఆ కుటుంబం అంటే.. ప్రజలు తోక తొక్కిన పాములా లేచేవారు. వారిని దేశం విడిచిపోయేలా తరిమికొట్టేవరకు నిద్రపోలేదు. ఆ కుటుంబం పీడ విరగడయ్యిందని సంబరపడ్డారు. పాత నేతల ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆందోళనలు విరమించారు. పరిస్థితి సద్దుమణిగింది. అక్కడి నేతలు ఇక దేశంలో నెలకొన్న సంక్షోభంపై దృష్టి పెడుతారని ప్రజలు భావించారు. కానీ పాలకులు మాత్రం తరిమికొట్టిన కుటుంబం కోసమే ఆరాటపడుతున్నారు. ప్రజలు పడుతున్న కష్టాలను విస్మరించారు. ఈ పరిస్థితులు శ్రీలంకవని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది తాజాగా థాయ్‌లాండ్‌ నుంచి స్వదేశానికి మాజీ అధ్యక్షుడు రాజపక్స తిరిగి వచ్చారు.

శ్రీలంకను పూర్తి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి విదేశాలకు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంకు తిరిగొచ్చారు. దాదాపు ఏడు వారాల తరువాత దేశ రాజధానిలో అడుగు పెట్టారు. బ్యాంకాక్‌ నుంచి సింగపూర్‌ మీదుగా కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య ఐయోమా రాజపక్స కూడా ఉన్నారు. గొటబయ రాక విషయం తెలుసుకున్న శ్రీలంక పోడుజన పెరమున-ఎస్‌ఎల్‌పీపీ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలు ఎయిర్‌పోర్టుకు చేరుకుని గొటబాయ రాజపక్సకు ఘన స్వాగతం పలికారు. ఆయనను అభినందించేందుకు పార్టీ నేతలు ఎగబడ్డారు. నెల రోజుల క్రితం గొటబాయ పక్కన ఉంటేనే ఎక్కడ దాడి చేస్తారోనని భయపడిన నేతలే ఇప్పుడు పుష్ఫగుచ్చాలతో గొటబయ స్వాగతానికి క్యూ కట్టడం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. స్వాగతం తరువాత సైన్యం భారీ భద్రత నడుమ విమానాశ్రయం నుంచి బయల్దేరి కొలంబోలోని ఆయనకు కేటాయించిన ప్రత్యేక బంగ్లాకు చేరుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో భారీగా ట్రెండ్‌ అవుతున్నాయి.

లంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స త్వరలో దేశానికి తిరిగి వస్తారన్నా ప్రచారం జోరుగా జరుగుతోంది. గొటబయకు రక్షణ కల్పించాలని అధికార పార్టీ ఎస్‌ఎల్‌పీపీ నేతలు ఇటీవల తరచూ డిమాండ్‌ చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడిని దేశానికి రప్పించి తగిన భద్రత కల్పించాల్సిందేనన్నారు. అదే సమయంలో విపక్షాలు కూడా అదే డిమాండ్‌ను చేశాయి. అయితే గొటబయను విచారణ చేయాల్సిందేనని విపక్ష పార్టీలు కోరుతున్నాయి. దేశంలో పలు ప్రాజెక్టుల్లో రాజపక్స కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని వాటిపై పూర్తి విచారణ జరిపి శిక్ష విధించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. మొత్తంగా గొటబయ మాత్రం శ్రీలంకకు చేరుకున్నారు. అయితే ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఎలాంటి అరెస్టు వారెంట్లు కూడా లేవు. పైగా ఆయనకు ప్రత్యేకంగా ఓ బంగ్లా కేటాయించి గొటబయకు 24 గంటల పాటు రక్షణ కల్పించనున్నారు. దాదాపుగా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎలాంటి వసతులనైతే ఆయన ఎంజాయ్‌ చేశారో అలాంటి వసతులనే మళ్లీ కల్పిస్తున్నారు. తేడా ఏమిటంటే ఆయనకు కేవలం అధికారం మాత్రం లేదు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆయన కనుసన్నల్లోనే నడుస్తుందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

నిజానికి మొదటి నుంచి రణిల్‌ విక్రమసింఘేను శ్రీలంక ప్రజలు నమ్మడం లేదు. రాజపక్స సోదరులు కష్టాల్లో ఉన్న సమయంలోనే విక్రమసింఘే అధికారం చేపడుతారని ఆ తరువాత రాజపక్సలకు అధికారం అప్పగిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇటీవల విక్రమసింఘే అధికారం చేపట్టినప్పుడు ఆయన నివాసంపైనా ప్రజలు దాడి చేశారు. కొందరు విక్రమసింఘేను రణిల్‌ రాజపక్సే అని ఎద్దేవా చేస్తారు. రాజపక్సేలు అధికారం కోల్పోయిన తరువాత రణిల్‌ విక్రమసింఘే అధ్యక్షుడిగా, రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే గుణవర్ధనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత లంకలోని ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేశారు. అధ్యక్ష నివాస భవనానికి సమీపంలోని గల్లే ఫేస్‌లోని ఉద్యమ శిబిరాలను తొలగించారు. వందల మంది ఆందోళనకారులను అరెస్టులు చేశారు. మిగిలిన వారు గత్యంరంలేక పలువురు ఇళ్లకు వెళ్లిపోయారు. ఫలితంగా లంకలో ఆందోళనలు సద్దుమణిగాయి. దీంతో గొటబయను మళ్లీ దేశానికి రప్పించారు.

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి రాజపక్స కుటుంబమే కారణమంటూ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఫిబ్రవరిలో ఆందోళనలు మొదలైనా ఏప్రిల్‌లో తీవ్రమయ్యాయి. గో- గొటా హోమ్‌ అంటూ నినాదాలు చేశారు. రాజపక్స కుటుంబం అధికారాన్ని వదిలేయాలంటూ డిమాండ్లు చేశారు. అయితే అధికారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ప్రధాని మహేంద రాజపక్స భీష్మించారు. అయితే మే 9న ప్రధాని అధికారిక నివాసాన్ని ప్రజలు ముట్టడించడంతో మహేంద రాజపక్స కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. గొటబయ మాత్రం అధ్యక్ష పదవిని అట్టిపెట్టుకున్నారు. అయితే సరిగ్గా రెండు నెలల తరువాత జులై 9న అధ్యక్ష నివాస భవనాన్ని వేలాది మంది ప్రజలు తరలివచ్చి ముట్టడించారు. విషయం ముందే తెలుసుకున్న గొటబయ పారిపోయారు. ఆ తరువాత అధ్యక్ష భవాన్ని ఆందోళనకారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ తరువాత గొటబయ పదవికి రాజీనామా చేస్తానన్నారు. నాటకీయ పరిణామాల మధ్య మాల్దీవులకు, అటు నుంచి సింగపూర్‌కు వెళ్లిపోయారు. ఆ తరువాత సింగపూర్‌ వీసా గడువు ముగియడంతో థాయ్‌లాండ్‌కు వెళ్లిపోయారు. 52 రోజుల పాటు దేశానికి దూరంగా ఉన్న గొటబయ కొలంబోకు చేరుకున్నారు.

శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. విదేశీ మారక నిధులు లేక దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పదిరెట్లకు పెరిగాయి. తినడానికి తిండిలేక.. ఇంట్లో ఉందామంటే.. కరెంటు లేక.. బయటకు వెళ్దామంటే పెట్రోలు లేక.. లంక ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశంలో ప్రతి పది కుటుంబాల్లో 8 కుటుంబాలు ఆకలి కేకలతో అల్లాడుతున్నాయి. లంకను భారత్‌ 400 కోట్ల డాలర్ల సాయం అందించి ఆదుకుంది. భారత్‌ తప్ప శ్రీలంకకు మరే దేశం సాయం చేయడానికి ముందుకు రాలేదు. సంక్షోభంతో అల్లాడుతున్న లంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎంఎఫ్‌ ఊరట కలగించింది. లంకకు 290 కోట్ల డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ రుణాన్ని 48 నెలల్లో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షించడానికి రుణ సాయం అందిస్తున్నట్టు ఐఎంఎఫ్ తెలిపింది. అయితే అర్థిక సహాయానికి ముందు అనేక దిద్దుబాటు చర్యలు చేపట్టాలని లంకకు ఐఎంఎఫ్‌ సూచించింది. అయితే మాజీ అధ్యక్షుడు గొటబయ దేశానికి వచ్చినా అక్కడ ఎలాంటి ఆందోళనలు తలెత్తలేదు. పరిస్థితిని ముందే అంచనా వేసిన అక్కడి ప్రభత్వం భారీ భద్రతను కల్పించింది. 

Tags:    

Similar News