తెరపైకి రష్యా మరో దారుణ ఆయుధం.. ఈఎంపీ వెపన్స్‌తో..

Russia: ఉక్రెయిన్‌లో యుద్ధం అనుకున్నట్టు సాగడం లేదా? అంటే.. అవుననే తాజా పరిణామాలు చెబుతున్నాయి.

Update: 2022-11-12 15:30 GMT

తెరపైకి రష్యా మరో దారుణ ఆయుధం.. ఈఎంపీ వెపన్స్‌తో..

Russia: ఉక్రెయిన్‌లో యుద్ధం అనుకున్నట్టు సాగడం లేదా? అంటే.. అవుననే తాజా పరిణామాలు చెబుతున్నాయి. మస్కో సేనలు ఖేర్సన్‌ను ఖాళీ చేశాయి. దీని వెనుక రష్యా ఏమైనా వ్యూహం పన్నిందా? లేక నిజంగానే ఖాళీ చేసిందా? అనే భయం ఉక్రెయిన్‌ను వెంటాడుతోంది. అయితే క్రెమ్లిన్‌ కొత్త ఆయుధాలు ప్రయోగించే అవకాశం ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు. యుద్ధంలో వినియోగించే ఆయుధాలు లేకపోవడమే అందుకు కారణమని చెబుతున్నారు. తాజాగా ఈఎంపీ అనే కొత్త తరహా ఆయుధాలను రష్యా సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఖేర్సన్‌ను ఖాళీ చేసినా.. అది తమ ప్రాంతమేనని రష్యా ప్రకటించడమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఈఎంపీ వెపన్స్‌ ఎలా పని చేస్తాయి? వాటిని ఎలా ప్రయోగిస్తారు?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భావించిన విధంగా ఉక్రెయిన్‌ యుద్ధం సాగడం లేదు. మూడ్రోజుల్లో యుద్ధం ముగుస్తుందని క్రెమ్లిన్‌ అంచనా వేసింది. అది కాస్తా తొమ్మిదో నెలలోనూ సాగుతోంది. రష్యా ఆయుధాలు అయిపోయాయి. వేలాది మంది సైనికులు మృత్యువాత పడ్డారు. లక్ష మందికి పైగా రష్యా సైన్యం మృతి చెంది ఉండొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు సైన్యాన్ని సమీకరించాలని పుతిన్‌ నిర్ణయించినా దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. యుద్ధంలో నాలుగు రీజియన్లను రెఫరెండం ద్వారా రష్యాలో పుతిన్‌ విలీనం చేసుకున్నారు. ఇప్పుడు వాటిని కూడా రష్యా కోల్పోతున్నది. తాజాగా ఖేర్సన్‌ నుంచి పూర్తిగా తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్టు రష్యా ప్రకటించింది. అసలు ఉన్నట్టుండి రష్యా ఖేర్సన్‌ రీజియన్‌ను ఎందుకు ఖాళీ చేస్తోంది? అన్న అనుమానం ఉక్రెయిన్‌ను వెంటాడుతోంది. మరోవైపు ఖేర్సన్‌ రీజియన్‌ను ఖాళీ చేసినా అది తమ భూభాగమేనని క్రెమ్లిన్‌ ప్రకటించడంతో ఉక్రెయిన్‌లో భయం పెంచుతోంది. ఖేర్సన్‌లో పేలుడు పదార్థాలను ఉంచి తమ సైన్యాన్ని చావు దెబ్బ కొట్టాలని రష్యా ప్లాన్‌ వేసిందేమోనని ఉక్రెయిన్‌ ఆందోళనకు గురవుతోంది. ఖేర్సన్‌ రీజియన్‌లో తాజాగా ఒకవైపు సంబురాలు జరుపుకుంటుంటే మరోవైపు పేలుడు పదార్థాల విషయమై భారీగా తనిఖీలను కీవ్‌ బలగాలు నిర్వహిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ వైపు నుంచి రష్యా దాడి చేస్తుందోనని ఉక్రెయిన్ సైన్యం టెన్షన్‌ పడుతోంది. అయితే శీతాకాలానికి భయపడే ఖేర్సన్‌లోని సైన్యాన్ని రష్యా వెనక్కి తీసుకుందని అమెరికా చెబుతోంది.

యుద్ధం ప్రారంభం నుంచి అణ్వాయుధాల గురించి రష్యా ప్రస్తావిస్తోంది. ఈ విషయమే పశ్చాత్య దేశాలను వణికిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రమాదకర ఆయుధాలతో రష్యా దాడి చేస్తుందన్న భయం ఉక్రెయిన్‌ను కలవరానికి గురిచేస్తోంది. మాస్కో ఈఎంపీ ఆయుధాలను ప్రయోగించే ప్రమాదముందని నివేదికలు చెబుతున్నాయి. ఈఎంపీ అంటే.. ఎలక్ట్రో మాగ్నెటిక్‌ పల్స్‌.. ఈఎంపీ ఆయుధం లక్ష్యంపై దాడి చేసి.. భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈఎంపీ ప్రయోగించిన ప్రాంతంలో కంప్యూటర్లు, రేడార్లుతో పాటు అన్ని ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను ధ్వంసం చేస్తుంది. ఈ ఆయుధం పడిన చోట ట్రాఫిక్‌ లైట్లు కూడా పని చేయవని నిపుణులు చెబుతున్నారు. కమ్యూనికేషన్‌తో పాటు మిలటరీ, పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనం అవుతాయట. ఇక ఇప్పటికే విద్యుత్‌ ప్లాంట్లు, నీటి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న మాస్కో ఈఎంపీ ఆయుధాలను వాడేందుకు సిద్ధమైనట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా రష్యా ఆధ్వర్యంలో న్యూక్లియర్‌, నాన్‌ న్యూక్లియర్‌ ఈఎంపీ ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే క్రెమ్లిన్‌ నాన్‌ న్యూక్లియర్ ఈఎంపీ ఫిరంగులను ప్రయోగించనున్నట్టు సమాచారం. ఈ ఫిరంగుల పరిధి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆయుధాలను ప్రయోగిస్తే రష్యా ఆయుధ సామగ్రి కూడా పని చేయవంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఈఎంపీ ఫిరంగుల ప్రయోగం విషయంలో క్రెమ్లిన్‌ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈఎంపీ ఆయుధాలను రష్యాకు చెందిన ప్రత్యేక దళం స్పెట్స్‌నాజ్‌ ప్రయోగిస్తుంది. ఈఎంపీ ఆయుధాలను సిరియా యుద్ధంలో మాస్కో ప్రయోగించింది. 2014లో క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న సమయంలోనూ ఈఎంపీ ఆయుధాలను ప్రయోగించింది. అయితే మనుషులపై ఇవి ఎలాంటి ప్రభావం చూపించవని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుధాలను తాజాగా మాస్కో సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈఎంపీ ఆయుధాలను రష్యా ప్రయోగిస్తే.. నాటో భూభాగంలోని కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఒకవేళ అణు ఈఎంపీలను రష్యా ప్రయోగిస్తే మాత్రం.. భారీ విధ్వంసం తప్పదు. యుద్ధంలో ఉక్రెయిన్‌ సైన్యాన్ని నిలువరించడానికి ఈఎంపీ ఆయుధాలను రష్యా ప్రయోగించొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈఎంపీ ఆయుధాలతో దాడి చేస్తే.. ఉక్రెయిన్‌ సైన్యం వద్ద ఉన్న ఆయుధాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థతో పాటు రేడియోస్‌, జీపీఎస్‌, నేవిగేషన‌‌, ఏరియల్‌ డ్రోన్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నీ నిర్వీర్యమవుతాయి. ఆ తరువాత.. అదును చూసి.. రష్యా దాడి చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ఆయుధాలను ఏ వ్యవస్థలూ నిలువరించలేవు. ఈ విషయమై ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమ దేశాలు కూడా ఈఎంపీ ఆయుధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈఎంపీ ఆయుధాలు రష్యాతో పాటు చైనా, ఉత్తర కొరియా దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి.

ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, దాని పరిసర ప్రాంతాల నుంచి పూర్తిగా రష్యా సైన్యం వెనక్కి వెళ్లిపోయింది. డ్నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను వెనక్కి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ పపరిణామంతో తాము కీలక విషయం సాధించినట్టు ఉక్రెయిన్‌ పేర్కొంది. ఖేర్సన్‌లో రష్యా బలగాలు వెల్లిపోవడంతో సందడి నెలకొంది. సెంట్రల్‌ ఖేర్సన్‌ కూడలి వద్ద ఓ స్మారకంపై మార్చి తరువాత తొలిసారి ఉక్రెయిన‌‌ పతాకం ఎగిరింది. సైనిక దుస్తుల్లో పెద్ద ఎత్తున పౌరులు వేడుకలు జరుపుకున్నారు. స్థానికులు వీధుల్లోకి వచ్చి ఆనందం పంచుకుంటున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఖేర్సన్‌ నగరం తమ నియంత్రణలోకి వచ్చినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. స్థానికంగా ఎవరైనా క్రెమ్లిన్‌ సైనికులు ఉంటే వెంటనే లొంగిపోవాలని సూచించింది. తమ సేనలు 41 ప్రాంతాలకు పైగా విముక్తి కల్పించినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలు వదిలి పెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే ఖేర్సన్‌ను రష్యా కోల్పోవడం మరో అవమానకర వెనకడుగా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఖేర్సన్‌ సమీపంలోని మైకోలైవ్లోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందారు.

9 నెలల యుద్ధంలో నాలుగు ప్రాంతాలను సొంతం చేసుకున్న రష్యా క్రమంగా వాటిని కోల్పోతున్నది. ఖేర్సన్‌ నుంచి పూర్తిగా తప్పుకున్న మాస్కో సేనలు లుహాన్‌స్క్ లోనూ ఇదే పరిస్థితి. డొనెట్‌స్క్‌లో ఇరు వర్గాల మధ్య భీకర పోరాటం సాగుతోంది. ఇప్పటికే డొనెట్‌స్క్‌ రీజియన్లలో కీవ్‌ బలగాల దూకుడు సాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ నాలుగు ప్రాంతాలను తిరిగి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News