Moon Hotel: చందమామపై హోటల్.. బుకింగ్స్ షురూ! అక్కడ ఒక రాత్రి ఉండాలంటే ఎన్ని కోట్లో తెలుసా?
చంద్రునిపై హోటల్ నిర్మించేందుకు అమెరికన్ స్టార్టప్ GRU స్పేస్ బుకింగ్స్ ప్రారంభించింది. 2032 నాటికి పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులో ఒక రాత్రి గడపాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిందే. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
చిన్నప్పుడు కథల్లో విన్న చందమామపై ఇల్లు.. ఇప్పుడు నిజం కాబోతోంది! సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన 'మూన్ హోటల్' కల సాకారం కానుంది. అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ చంద్రునిపై హోటల్ నిర్మించబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా, బస కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎవరా కంపెనీ? ప్లాన్ ఏంటి?
కాలిఫోర్నియాకు చెందిన గెలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ (GRU) స్పేస్ అనే సిలికాన్ వ్యాలీ స్టార్టప్ ఈ సాహసోపేతమైన ప్రాజెక్టును చేపట్టింది. 2032 నాటికి చంద్రుని ఉపరితలంపై మానవ స్థావరాన్ని (Lunar Base) నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. చంద్ర పర్యాటకం ద్వారా 'ల్యూనార్ ఎకానమీ'ని ప్రారంభించాలని ఈ సంస్థ భావిస్తోంది.
ధర వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
చందమామపై ఉండాలని అనుకుంటే మీ జేబులో కోట్లాది రూపాయలు ఉండాల్సిందే. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
కేవలం రిజర్వేషన్ కోసమే: రూ. 2.2 కోట్ల నుండి రూ. 9 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
మొత్తం యాత్రకు: ప్రయాణ ఖర్చులతో కలుపుకుంటే మొత్తం ప్యాకేజీ రూ. 90 కోట్లు దాటవచ్చని అంచనా.
దరఖాస్తు రుసుము: కేవలం అప్లికేషన్ కోసమే 1,000 డాలర్లు (సుమారు రూ. 83 వేలు) చెల్లించాలి. ఇది రీఫండ్ చేయబడదు.
హోటల్ నిర్మాణం ఎలా?
భూమి మీద నుంచి ఇటుకలు, సిమెంట్ చంద్రుడిపైకి తీసుకెళ్లడం అసాధ్యం. అందుకే GRU స్పేస్ ఒక వినూత్న సాంకేతికతను వాడుతోంది:
చంద్రుని ధూళితోనే ఇటుకలు: అక్కడ దొరికే దుమ్మును ఇటుకలుగా మార్చే టెక్నాలజీపై పనిచేస్తున్నారు.
రక్షణ: ఈ ఇటుకలు హోటల్‌లోని పర్యాటకులను రేడియేషన్ మరియు ప్రమాదకరమైన ఉష్ణోగ్రతల నుండి రక్షిస్తాయి.
మొదటి అడుగు: 2029లో కంపెనీకి చెందిన మొదటి పేలోడ్ చంద్రునిపై ల్యాండ్ కానుంది.
అందరికీ అవకాశం ఉంటుందా?
డబ్బు ఉంటే సరిపోదు.. ఈ ప్రయాణానికి వెళ్లేవారిపై కంపెనీ కఠినమైన పరీక్షలు నిర్వహిస్తుంది.
ఆర్థిక శక్తి: అంత ఖర్చు భరించగలరా లేదా అనే డాక్యుమెంట్లు చూపాలి.
ఆరోగ్యం: శారీరకంగా, మానసిక సిద్ధంగా ఉన్నారా లేదా అని తేల్చేందుకు మెడికల్ రిపోర్ట్స్ అవసరం.
బ్యాక్‌గ్రౌండ్ చెక్: పర్యాటకుల నేపథ్యాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
మొత్తానికి, ఇప్పటివరకు కేవలం 12 మంది వ్యోమగాములు మాత్రమే చంద్రునిపై అడుగు పెట్టగా, ఇప్పుడు సాధారణ ప్రజలు (కోటీశ్వరులు) కూడా ఆ జాబితాలో చేరే అవకాశం కలగబోతోంది.