నాటో ఎఫెక్ట్‌: ఫిన్లాండ్‌కు పవర్‌ కట్‌..

NATO: నాటోలో చేరాలన్న ఆ దేశం కోరిక అంధకారంలోకి నెట్టేయనున్నది.

Update: 2022-05-14 10:36 GMT

నాటో ఎఫెక్ట్‌: ఫిన్లాండ్‌కు పవర్‌ కట్‌..

NATO: నాటోలో చేరాలన్న ఆ దేశం కోరిక అంధకారంలోకి నెట్టేయనున్నది. నాటోలో చేరతామని ఐరోపా దేశం ఫిన్లాండ్‌ అలా ప్రకటించిందో లేదో విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తామని రష్యాకు చెందిన ఎనర్జీ సంస్థ RAO నార్డిక్‌ ప్రకటించింది. మే నెలలో విద్యుత్‌ సరఫరా బిల్లులను పిన్లాండ్‌ చెల్లించలేదని RAO తెలిపింది. ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరడంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నాటోలో చేరితే ఉక్రెయిన్‌కు పట్టిన గతే పడుతోందని ముందు నుంచి పుతిన్‌ హెచ్చరిస్తున్నారు. తాజాగా విద్యుత్‌ సరఫరా నిలిపేయడం హెచ్చరికల్లో భాగమేనా? అనే విషయమై పిన్లాండ్‌ మాత్రం స్పందించలేదు. తాజా రష్యా చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

గతంలో నాటోలో చేరడానికి ఫిన్లాండ్‌ అంతగా ఆసక్తి చూపలేదు. రష్యాకు ఆగ్రహం తెప్పిస్తుందనే ఇప్పటివరకు మౌనంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తమకు ముప్పు పొంచి ఉందని ఫిన్లాండ్‌ ప్రజలు భావిస్తున్నారు. నాటో సభ్యత్వం తీసుకోవాలని జనాభాలో సగానికి పైగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ రష్యా దాడి చేస్తే తమకు నాటో దళాలు అండగా ఉంటాయని ఫిన్లాండ్‌ భావిస్తోంది. రష్యాతో 13వందల కిలోమీటర్ల సరిహద్దును ఫిన్లాండ్‌ పంచుకుంటోంది. అందులోనూ పుతిన్ సొంత నగరం సెయింట్‌పీటర్‌బర్గ్స్‌కు అతి సమీపంలో ఫిన్లాండ్‌ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నాటో కూటమిలో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్‌ దరఖాస్తు చేసుకున్నాయి. అదే సమయంలో విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తున్నట్టు రష్యా సంస్థ RAO ప్రకటించింది.

రష్యా విద్యుత్‌ సరఫరా నిలిపేయడంతో తమకు ఎలాంటి నష్టం లేదని ఫిన్లాండ్‌ పవర్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఫిన్లాండ్‌ విద్యుత్‌ అవసరాల్లో కేవలం 10 శాతం మాత్రమే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు. దేశంపై అంత పెద్ద ప్రభావం చూపదంటున్నారు. ఫిన్లాండ్‌లో భారీగానే విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందన్నారు. 2023 నాటికి విద్యుత్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. అంతగా అవసరం అనుకుంటే స్వీడన్‌ నుంచి విద్యుత్‌ దిగుమతులను పెంచుతామన్నారు. ఆ లోటును భర్తీ చేసుకునే అవకాశం తమకు ఉందని పవర్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. విద్యుత్‌ సరఫరాను నిలిపేయడంతో తమకంటే రష్యాకే ఎక్కువ నష్టమని పిన్లాండ్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాకు ఇది మరింత నష్టాన్ని కలుగుజేస్తుందన్ని ఫిన్లాండ్‌ చెబుతోంది. అయితే నాటో చేరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఫిన్లాండ్‌ సమాధానం చెప్పలేదు. 

Tags:    

Similar News