పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ సంచలన వ్యాఖ్యలు

Imran Khan: దొంగలు తనకు నీతులు చెబుతున్నారని విమర్శలు

Update: 2022-05-15 04:00 GMT

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ సంచలన వ్యాఖ్యలు

Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని దొంగల చేతికి చుక్కాని అప్పగించడం కంటే పాకిస్థాన్‌పై అణుబాంబులు వేయడమే మేలన్నారు. ఇస్లామాబాద్‌లోని బనిగల నివాసంలో ఇమ్రాన్ విలేకరులతో మాట్లాడారు. దేశంలో దొంగలు రెచ్చిపోవడం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. దొంగలు కూడా తనకు నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ముందు ప్రభుత్వాన్ని సక్రమంగా నడపాలని విమర్శలు గుప్పించారు. దొంగలు అధికారంలోకి రావడంతో ప్రతి సంస్థను, న్యాయ వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారి ఈ నేరస్థుల కేసులను విచారిస్తారని ఇమ్రాన్‌ ప్రశ్నించారు.

20న నిర్వహించనున్న భారీ ర్యాలీని రాజధానిలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి పీటీఐ చీఫ్‌ హెచ్చరించారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు 2 లక్షల మందికి పైగా ప్రజలు భారీ ర్యాలీతో ఇస్లామాబాద్‌ చేరుకుంటారని ఇమ్రాన్‌ తెలిపారు. అడ్డంకులు సృష్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇస్లామాబాద్‌కు మాత్రం వచ్చి తీరుతామని మాజీ ప్రధాని తేల్చి చెప్పారు. తమ ర్యాలీ ప్రకటనతో దిగుమతి ప్రభుత్వానికి భయం పెరిగిందని ఆరోపించారు. తనను అధికారం నుంచి తొలగించడంలో 11 పార్టీలు కుట్ర పన్నాయని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్‌ ఖాన్‌ తన ప్రసంగాలతో ప్రజల మనస్సుల్లో విషయం నింపుతున్నారని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. ఖాన్‌ పదే పదే దొంగలు దోపిడీదారులు అని పిలవడంతో దేశంలో విద్వేషం మొదలవుతుందని ఆరోపించారు. ఇమ్రాన్‌ అక్రమాలు, అవినీతిపై విచారణ జరుపుతామన్నారు. పీటీఐ చీఫ్‌ను జైలుకు పంపడం ఖాయమన్నారు.

ఏప్రిల్‌ 10 రాత్రి అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు తమ బలాన్ని నిరూపించుకోవడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు ముగ్గురు ప్రధానులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఇద్దరు ప్రధానులు మాత్రం అవిశ్వాస తీర్మానంలోని ఓటింగ్‌కు ముందే రాజీనామా చేశారు. అయితే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో ఓడిపోయిన తరువాత రాజీనామా చేసిన తొలి ప్రధానిగా ఇమ్రాన్‌ రికార్డులకెక్కడు. అయితే పాకిస్థాన్‌లో ఇప్పటివరకు ఏ ప్రధాని ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపలేదు. అక్కడి అర్మీ కనుసన్నల్లోనే ప్రభుత్వాలు మసలుకుంటున్నాయి. 75 ఏళ్ల పాక్‌ చరిత్రలో అత్యధిక కాలం దేశాన్ని ఆర్మీనే పాలించడం గమనార్హం.

Tags:    

Similar News