మళ్లీ మళ్లీ ఇండియాను సమర్థిస్తూ ఇమ్రాన్ వ్యాఖ్యలు.. ఇండియాకు వెళ్లిపోవాలంటూ పార్టీల నిప్పులు...

Imran Khan: ఇండియాను పొగడటంతో ఇమ్రాన్ పై విమర్శల వెల్లువ...

Update: 2022-04-22 10:41 GMT

మళ్లీ మళ్లీ ఇండియాను సమర్థిస్తూ ఇమ్రాన్ వ్యాఖ్యలు.. ఇండియాకు వెళ్లిపోవాలంటూ పార్టీల నిప్పులు...

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఒకటే మాట... ఒకటే బాటలా నడుస్తున్నాడు.. రాజకీయాల్లో అవసరాలు, సందర్భాలను బట్టి మాటలు మార్చే నేతలకు భిన్నంగా తాను ఏదైతే నమ్ముతున్నాడో అదే మళ్లీ మళ్లీ చెబుతున్నాడు. ఇండియా విదేశాంగ విధానం అత్యుత్తమమైనదంటూ మరోసారి ప్రశంసలు కురిపించాడు ఇమ్రాన్ ఖాన్. ఇండియా సొంత విదేశాంగ విధానంతో దేశ ప్రయోజనాలు కాపాడుకుంటుంటే... పాకిస్తాన్ మాత్రం పొరుగు దేశాలు చెప్పినట్టు చెప్పి కాలం గడుపుతోందని విమర్శించారు. కొందరు ప్రజలకోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టుపెడుతున్నారంటూ మండిపడ్డారు.

ఇండియా అమెరికాతో దౌత్యపరంగా ముందుకెళ్తూనే... రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకుంటుందని... ఇది ఇండియా సాధించిన అపూర్వ విజయమన్నారు ఇమ్రాన్. ఐతే పాకిస్తాన్ విదేశీ విధానం మాత్రం పూర్తిగా ప్రజలకు లాభం కలిగించేలా లేదన్నారు. ఇటీవల రష్యా పర్యటన తర్వాత తన పదవి కోల్పోయామన్న భావనలో ఉన్న ఇమ్రాన్ ఖాన్... తన రష్యా పర్యటనను సమర్థించుకున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు... కొందరు లోకల్ నాయకులు, విదేశీ శక్తులతో చేతులు కలిపారంటూ దుయ్యబట్టారు ఇమ్రాన్.

ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానానికి ముందు సైతం ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించడంపై విమర్శలు వెల్లువెత్తాయ్. ఇండియా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని... ఎక్కడా కూడా భారత ప్రయోజనాల విషయంలో రాజీపడలేదని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను.. ఒక అగ్రదేశం ఏవిధంగా తీసుకెళ్లగలదో... ఆ విధంగా ఇండియా చేయగలిగిందని కూడా ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. కొంత కాలంగా ఇండియాను సమర్థిస్తూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలతో అక్కడ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయ్.. ఇమ్రాన్ పాకిస్తాన్ వదిలి.. ఇండియా వెళ్లి పోవాలని సూచించాయ్.

ఇండియాను పొగిడే... ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కు అవసరం లేదని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తనయ మరియం షరీఫ్ దుమ్మెత్తిపోశారు. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ మనసులో ఉన్నది మాట్లాడుతూ ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా... ముందుకు సాగుతున్నారు. నిజాలే మాట్లాడుతానంటూ ప్రజల్లో తేల్చుకునేందుకు వెళ్తూ... అక్కడి రాజకీయ పార్టీలకు, అమెరికాకు కొరగాని కొయ్యగా మారారు ఇమ్రాన్. ఇండియాను కీర్తిస్తే... పాకిస్తాన్ లో విలన్ ను చేయడం విభజన తర్వాత రొటీన్ గా జరుగుతున్న వ్యవహారమే.. కానీ అందుకు భిన్నంగా ఇమ్రాన్ అడుగులు వేయడం సంచలనంగా మారింది.

Tags:    

Similar News