ఊహించని విధంగా మారుతున్న వాతావరణం.. ఒక్క కెనడాలోనే ఉష్ణోగ్రతల కారణంగా 240 మంది మృతి

Heatwave: ప్రపంచ దేశాల్లో వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి.

Update: 2021-07-01 15:30 GMT

ఊహించని విధంగా మారుతున్న వాతావరణం

Heatwave: ప్రపంచ దేశాల్లో వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే కరోనాతో కనీవినీ ఎరుగని రీతిలో మానవాళి అల్లకల్లోలమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పులు పలు దేశాల్లో హడలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలను మింగేస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నాయని రిలాక్సయ్యేలోపే వాతావరణ మార్పులు బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడూ కూల్‌గా కెనడా, అమెరికాలో అత్యధిక ఉష్ణోగ్రతలు రెడ్ అలర్ట్‌లకు కారణమవుతున్నాయి.

కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఉక్కిరిబిక్కిరయిన అమెరికా, కెనడాలు ఇప్పుడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటివరకూ ఒక్క కెనడాలోనే 240మంది ఎండ వేడిమిని తట్టుకోలేక మరణించారంటే అక్కడి పరిస్థితి ఏం రేజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేనంతగా వెదర్ హీట్ పుట్టిస్తుండడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించడమే కాదు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. బ్రిటష్ కొలంబియాలోని లైటన్‌లో అత్యధికంగా 49.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

మరోవైపు వాంకోవర్‌లో పరిస్థితి మరింత భీతావహంగా ఉంది. ఇక్కడే సుమారు 135 మంది మృత్యువాతపడ్డారు. కనీవినీ ఎరుగని రీతిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు సహా స్కూళ్లను మూసీవేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ వరకూ టీకాల పంపిణీ ఉండబోదని అధికారులు తెలిపారు. ఎండ నుంచి ఉపశమనానికి నడి రోడ్లపై టెంపరరీ వాటర్ ఫౌంటెయిన్ లు, నీటి జల్లు కేంద్రాలను, పలు ప్రాంతాల్లో కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్స్, బీచ్‌ల వద్ద ప్రజల సందడి అధికంగా ఉంది.

అటు అగ్రరాజ్యం అమెరికాలోనూ పలు ప్రాంతాల్లోనూ సేమ్ సీన్. ముఖ్యంగా పోర్ట్ లాండ్, ఓరెగాన్, సియాటెల్, వాషింగ్టన్ ప్రాంతాల్లో విద్యుత్ కు డిమాండ్ పెరుగగా, సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. వెస్ట్ యూఎస్ లోని 4 కోట్ల మందిని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరికొంత కాలం పాటు అధికంగా నమోదు కావచ్చని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యూఎస్ లోని 11 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉన్న సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ లో పూర్తి స్థాయిలో ప్రజలను అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇక ఈ పరిస్థితులకు పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతల్లో తేడా కారణంగా ఏర్పడే హీట్‌డోమ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మానవాళి పర్యావరణానికి చేస్తున్న హాని ఫలితంగా కూడా ఉష్ణోగ్రల్లో భారీ మార్పులు ఏర్పడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  

Tags:    

Similar News