Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య

Earthquake: మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

Update: 2023-11-04 03:13 GMT

Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య

Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 128 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంపం ధాటికి ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. జాజర్ కోట్ జిల్లాలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భూప్రకంపనలతో ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు ప్రజలు. 20 సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నేపాల్‌లోని భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి.

నేపాల్‌ వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అర్ధరాత్రి కావడం వల్ల పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ తెగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత జాజర్​జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు చెప్పారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాలు అంధకారంగా మారిపోయాయి. కాగా.. ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు సైతం కంపించాయి. నేపాల్‌కు 800 కిలోమీటర్ల ఉన్న ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీలోని ప్రజలు ఏం జరుగుతుందో తెలియక రోడ్లపైకి పరుగులు తీశారు.

భూకంపం ధాటికి రుకుం జిల్లాలో 36 మందికి పైగా మరణించారని, అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని అక్కడి పోలీసు అధికారి నర్వరాజ్ భట్టారాయ్ తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఇప్పటికే స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది మరణించారని ప్రభుత్వ పరిపాలన అధికారి తెలిపారు. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. నేపాల్‌లో గత నెల 3న 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీనివల్ల భారత్‌లోని ఢిల్లీ‎ ప్రాంతంలో కూడా కదలికలు సంభవించాయి. నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 12 వేల మంది మరణించారు. పది లక్షలకుపైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.

భూకంపం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ ప్రచండ సంతాపం ప్రకటించారు. భూకంపంలో గాయపడ్డ వారికి తక్షణ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని మూడు భద్రతా సంస్థలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. దైలేఖ్‌, సల్యాన్‌, రొల్పా జిల్లాల్లో కూడా పలువురు మృతిచెందారని, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. 

Tags:    

Similar News