Mount Erebus: బంగారం వెదజల్లుతున్న అగ్ని పర్వతం..రోజుకు ఎంత వస్తుందో తెలుసా..?
Mount Erebus: బంగారం వెదజల్లుతున్న అగ్ని పర్వతం.. దాని నుంచి రోజుకు ఎంత గోల్డ్ వస్తుందో తెలుసుకుందాం
Mount Erebus
Mount Erebus: ప్రకృతి వైవిధ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మంచు పలకల మధ్య అగ్నిపర్వతాలు ఉండటమే ఒక వింత అనుకుంటే, ఆ అగ్నిపర్వతం నుండి ఏకంగా బంగారం కురుస్తోందంటే నమ్మగలరా? వినడానికి ఏదో అభూత కల్పనలా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. అంటార్కిటికాలోని మౌంట్ ఎరేబస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భయంకరమైన వేడితో కూడిన లావా, బూడిద, విష వాయువులు బయటకు వస్తాయి. కానీ, అంటార్కిటికాలో ఉన్న మౌంట్ ఎరేబస్ మాత్రం అందుకు భిన్నం. ఇది నిరంతరం బంగారు రేణువులను గాలిలోకి వెదజల్లుతోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ అగ్నిపర్వతం ప్రతిరోజూ సుమారు 80 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని విడుదల చేస్తోంది. అంటే రోజుకు దాదాపు 6 లక్షల రూపాయల (ప్రస్తుత ధరల ప్రకారం) విలువైన బంగారం గాలిలో కలిసిపోతోందన్నమాట.
ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారినప్పటికీ, శాస్త్రవేత్తలు దీనిని 1991లోనే గుర్తించారు. ఇటీవల నాసా ఎర్త్ అబ్జర్వేటరీ కూడా ఈ అద్భుతాన్ని ధృవీకరించింది. భూమి అంతర్భాగం నుంచి ఎగిసిపడే లావాతో పాటు, చిన్న చిన్న స్పటిక రూపంలో ఉండే బంగారు రేణువులు వాయువుల ద్వారా బయటకు వస్తున్నాయి. ఇవి ఎంత తేలికగా ఉంటాయంటే.. అగ్నిపర్వతం నుండి వెలువడిన తర్వాత గాలిలో ప్రయాణించి సుమారు 1000 కిలోమీటర్ల దూరం వరకు విస్తరిస్తాయట.
రోజూ బంగారం పడుతోంది కదా అని అక్కడికి వెళ్లడం అంత సులభం కాదు. మౌంట్ ఎరేబస్(Mount ఏరేబీస్) దగ్గరకు వెళ్లడం ప్రాణాలతో చెలగాటమే. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.పర్వతం చుట్టూ అత్యంత వేడితో కూడిన లావా సరస్సు నిరంతరం మరుగుతూ ఉంటుంది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అంటార్కిటికా అంటేనే మంచు సామ్రాజ్యం. ఒకవైపు అగ్నిపర్వత వేడి, మరోవైపు మైనస్ డిగ్రీల చలి.. ఈ భీకరమైన వాతావరణంలో మనుషులు మనుగడ సాగించడం అసాధ్యం.
నాసా పరిశోధనల ప్రకారం, కేవలం బంగారమే కాదు.. ఎరేబస్ నుండి ఇతర విలువైన ఖనిజాలు, లోహాలు కూడా విడుదలవుతున్నాయి. భూమి లోపల జరిగే రసాయనిక చర్యల వల్ల ఈ లోహాలు వాయు రూపంలో మారి, పైకి రాగానే చల్లబడి చిన్న రేణువులుగా మారుతున్నాయి.ప్రకృతి తన గర్భంలో ఎన్ని రహస్యాలను దాచుకుందో చెప్పడానికి మౌంట్ ఎరేబస్ ఒక సజీవ సాక్ష్యం. మంచు ఖండంలో మంటలు చిమ్ముతూ, బంగారం వెదజల్లే ఈ పర్వతం నిజంగా భూమిపై ఉన్న ఒక అద్భుతం.
మనుషులు చేరుకోలేని అత్యంత దుర్భరమైన ప్రాంతంలో ఈ బంగారు నిధి ఉండటం ప్రకృతి ఆడిన వింత నాటకంలా అనిపిస్తుంది. మనకు అందనంత దూరంలో, మంచు పలకల మధ్య ఈ అగ్నిపర్వతం ఇంకా ఎన్ని రహస్యాలను దాచిపెట్టిందో భవిష్యత్తులో శాస్త్రవేత్తలే చెప్పాలి.