హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తున్న మొస్సాద్
తమ దేశానికి ప్రమాదకరంగా భావించే వ్యక్తులను లక్ష్యం చేసుకోవడం ఇజ్రాయెల్‌కు కొత్తేమీ కాదు.
తమ దేశానికి ప్రమాదకరంగా భావించే వ్యక్తులను లక్ష్యం చేసుకోవడం ఇజ్రాయెల్‌కు కొత్తేమీ కాదు. ఎంత కట్టుదిట్టమైన భద్రత మధ్య శత్రువు ఉన్నాఅంత మొందించగల సత్తా ఆ దేశ నిఘా విభాగం మొస్సాద్‌కు సొంతం. అలాంటిది ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ నాయకులపై ఇటీవల చేసిన దాడి ఎందుకు విఫలమైంది? ఇజ్రాయెల్ లెక్క ఎక్కడ తప్పింది? హమాస్ నాయకులను వేటాడటంలో ముందుండే మొస్సాద్.. దోహా ఆపరేషన్‌ను ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించింది?.. ఇవన్నీ చర్చకు దారి తీస్తాయి.
ఖతార్ రాజధాని దోహాపై ఇటీవల ఇజ్రాయెల్ డాడి చేసింది. ఆ దాడిలో హమాస్ కీలక నేతలు తప్పించుకున్నారు. అయితే ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ భద్రతా సంస్ధలే తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా నిఘా సంస్థ మొస్సాద్.. దాడికి అభ్యంతరం తెలిపింది. మొస్సాదే కాక, ఐడీఎఫ్ చీఫ్ ఇయాల్ జామిర్, జాతీయ భద్రతా సలహాదారుడు జాకీ హనెగ్‌బీ కూడా దోహా ఆపరేషన్‌ను వ్యతిరేకించారు. హమాస్‌తో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నీట్‌జాన్ లోన్‌ను కూడా చర్చలకు ఆహ్వానించలేదు. దీనికి ప్రధాన కారణం ఆపరేషన్‌ను ఆయన వ్యతిరేకిస్తారని ఉన్నత అధికారులు చెబుతున్నారు.
దోహాతో ఆపరేషన్ నిర్వహిస్తే.. గాజా యుద్ధం ముగించడానికి జరుగుతున్న శాంతి చర్చలు విఫలమవడమే కాకుండా, ఖతార్‌తో తమ సంస్థకున్న కీలక సంబంధాలు దెబ్బతింటాయని మొస్సాద్ చీఫ్ డేవిడ్ బార్నే భావించారు. అందుకే దాడి ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. శాంతి, చర్చలు జరుగుతున్న సమయంలో హమాస్ నేతలను చంపాలన్న నిర్ణయాన్ని కూడా ఆయన ప్రశ్నించిచారు. మూడు, నాలుగేళ్లలో వాళ్లను ఎలాగైనా అంతమొందిస్తామని.. వారిని హతమార్చడం ఎలాగో మొస్సాద్‌కు తెలుసని బార్నే తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ గగనతల దాడిని ఎంచుకోవాల్సి వచ్చింది. చివరకు వాయుసేన.. అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌తో కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాల్సి వచ్చింది.
సౌదీ గగనతలంలోకి ప్రవేశించకుండా ఎర్రసముద్రం నుంచే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ ఆపరేషన్‌లో ఎనిమిది ఎఫ్-15లు, నాలుగు ఎఫ్-35లతో ఇజ్రాయిల్ దాడి చేసింది. ఈ ఆపరేషన్ గురించి అమెరికాకు తెలిస్తే ఎక్కడ అభ్యంతరం చెబుతుందోనని.. ఆ దేశానికి ఇజ్రాయెల్ తెలపలేదు. తమకు సమాచారం అందిన సమయానికే క్షిపణులు లక్ష్యాన్ని తాకాయని అమెరికా రక్షణ అధికారి తెలిపారు. దాడిలో హమాస్ నాయకులు ఎవ్వరూ చనిపోలేదని ఇజ్రాయెల్ భద్రతా అధికారులు నిర్ధరించారు. సాధారణ పౌరులకు ఏమైనా జరిగితే ఖతార్ తీవ్రస్థాయిలో ఇజ్యాయిల్‌పై విరుచుకుపడుతుందన్న భయంతో.. దాడి తీవ్రత తగ్గడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ దాడిలో ఒకరిద్దరు కీలక హమాస్ నాయకులు గాయపడ్డారని.. అందులో అల్-హయ్యా ఉన్నారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.