Mohammad Raad: హెజ్‌బొల్లాకు కోలుకోలేని దెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో అగ్రనేత మహ్మద్ రాడ్ మృతి!
Mohammad Raad: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమయ్యాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) సోమవారం జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది.
Mohammad Raad: హెజ్‌బొల్లాకు కోలుకోలేని దెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో అగ్రనేత మహ్మద్ రాడ్ మృతి!
Mohammad Raad: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమయ్యాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) సోమవారం జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా పార్లమెంటరీ బ్లాక్ అధిపతి, కీలక నేత మహ్మద్ రాడ్ (Mohammad Raad) మృతి చెందినట్లు సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ధృవీకరించింది.
దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా కంచుకోటలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. మహ్మద్ రాడ్‌తో పాటు మరికొందరు ఉన్నతాధికారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. లెబనాన్ అధికారిక గణాంకాల ప్రకారం, ఈ తాజా దాడుల్లో ఇప్పటివరకు 31 మంది మరణించగా, 149 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
హెజ్‌బొల్లా నేతలు లెబనాన్ ప్రజల క్షేమం కంటే ఇరాన్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఐడీఎఫ్ నార్తర్న్ కమాండ్ చీఫ్ రఫీ విమర్శించారు. "హెజ్‌బొల్లా రెచ్చగొట్టే చర్యలకు దిగడం వల్లే మేము ప్రతిదాడులు చేస్తున్నాం. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టడమే మా లక్ష్యం" అని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉన్నందున, దక్షిణ లెబనాన్‌లోని సుమారు 50 గ్రామాలను తక్షణమే ఖాళీ చేయాలని స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే ఇటు గాజా, అటు ఇరాన్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్.. ఇప్పుడు లెబనాన్ సరిహద్దుల్లో హెజ్‌బొల్లా అగ్రనేతలను ఏరివేస్తుండటం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. హెజ్‌బొల్లా తన కీలక నేతను కోల్పోవడంతో ఇరాన్ నుంచి ఎటువంటి ప్రతిచర్య ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.