Twitter: ట్విట్టర్ సంస్కరణల్లో భారతీయుడికే పట్టం
Twitter: ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
Twitter: ట్విట్టర్ సంస్కరణల్లో భారతీయుడికే పట్టం
Twitter: ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సంస్థ సీఈవోగా ఉన్న భారతీయుడు పరాగ్ అగర్వాల్‌ను తొలగించారు. అయితే అదే సమయంలో ట్విట్టర్‌లో మార్పులకు మరో భారతీయుడిని ఎలాన్ మస్క్ నియమించారు. టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా విశేష అనుభవం ఉన్న చెన్నైవాసి శ్రీరామ్ కృష్ణన్‌కు టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. శ్రీరామ్ భారతీయ అమెరికన్ పెట్టుబడిదారుడు, సాంకేతిక నిపుణుడు. చెన్నైలో జన్మించిన ఆయన ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్రధాన టీంలో సభ్యుడు. ట్విట్టర్ సంస్థ కోసం ఎలాన్ మస్క్‌కు సహకరిస్తున్నట్లు శ్రీరామ్ తెలిపారు. కొందరు గొప్ప వ్యక్తులతో కలిసి తాత్కాలికంగా మస్క్ కోసం పని చేస్తున్నట్టు వివరించారు. మస్క్ సారథ్యంలో ట్విట్టర్ మరింత గొప్పగా ఎదుగుతుందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే శ్రీరామ్ ట్విట్టర్ కోసం తాత్కాలికంగా పని చేస్తున్నారు. a16z సంస్థలో తాను పనిచేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీరామ్ పనిచేసే a16z ఒక ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ. స్టార్టప్‌లు, ఇతర కంపెనీలు, క్రిప్టో సంస్థలలో a16z పెట్టుబడులు పెడుతుంది.
ఇదిలా ఉంటే శ్రీరామ్ గతంలో ట్విటర్, మెటా, స్నాప్‌లో ప్రొడక్ట్, ఇంజనీరింగ్ టీమ్స్‌కు నాయకత్వం వహించారు. ట్విట్టర్‌లో 2017 నుంచి 2019 వరకు మూడేళ్లపాటు కోర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ టీమ్‌కి లీడర్‌గా ఉన్నారు. చెన్నైలోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ అన్నా యూనివర్సిటీలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. 2005లో బీటెక్ పూర్తి చేసిన శ్రీరామ్ తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశారు. అమ్మ గృహిణి. శ్రీరామ్ భార్య పేరు ఆర్తి. 2002లో యాహూ మెసేంజర్‌లో పరిచయమైన వారు.. ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన శ్రీరామ్ బీటెక్ అయిన తరువాత అమెరికాకు వెళ్లిపోయారు. యూఎస్‌లోని సీటెల్‌కు వెళ్లిన శ్రీరామ్ మైక్రోసాఫ్ట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ అతను విండోస్ అజూర్‌కు సంబంధించిన అనేక ప్రాజెక్టులపై పనిచేశారు. ట్విట్టర్‌లో పని చేసినప్పుడు ట్విటర్ హోం టైమ్‌లైన్, ప్లాట్‌ఫామ్ న్యూ యూజర్ ఇంటర్‌ఫేస్, సెర్చ్, డిస్కవరీ, ఆడియెన్స్ గ్రోత్ వంటి ప్రొడక్ట్‌లకు సంబంధించిన టీమ్స్‌కి నాయకత్వం వహించారు.
ఫేస్‌బుక్‌లో పని చేసిన సమయంలో మొబైల్ యాడ్ ప్రొడక్ట్‌లను సైతం అభివృద్ధి చేశారు. ఇప్పుడా మొబైల్ యాడ్ ప్రొడక్ట్స్ డిస్‌ప్లే అడ్వర్‌టైజింగ్ అతిపెద్ద నెట్‌వర్కుల్లో ఒకటిగా అవతరించింది. ప్రస్తుతం కృష్ణన్ సిలికాన్ వ్యాలీలోని వెంచర్ క్యాపిటల్ కంపెనీ అయిన ఆండ్రిసెన్ హోరోవిట్జ్- a16zలో పార్ట్‌నర్‌గా ఉన్నారు. బిట్‌స్కీ, హోపిన్, పాలీవర్క్ కంపెనీ బోర్డుల్లోనూ శ్రీరామ్ కృష్ణన్ భాగస్వామిగా కొనసాగుతున్నారు. భారతీయుడైన సీఈవో పరాగ్ అగర్వాల్‌ను తొలగించిన ఎలాన్ మస్క్.. మళ్లీ భారతీయుడికే మార్పుల బాధ్యతలను అప్పటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ట్విట్టర్‌లో కీలక పదవుల్లో ఉన్న పలువురు క్రమంగా తప్పుకుంటున్నారు. కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయా గద్దెలపై ఎలాన్ మస్క్ వేటువేశారు.