Pakistan: పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనం.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ!
Pakistan Republic Party: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్త పార్టీని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది.
Pakistan: పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనం.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ!
Pakistan Republic Party: పాకిస్థాన్ రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్త పార్టీని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది.
ఇటీవలి కాలంలో ఆర్థిక మాంద్యం, 'ఆపరేషన్ సిందూర్' ప్రభావంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే ప్రయత్నాల్లో ఉండగా, రెహమ్ రాజకీయ రంగప్రవేశం కొత్త మలుపు తిప్పినట్లైంది.
పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ.. ప్రజల పక్షానే ప్రయాణం
కరాచీ ప్రెస్‌క్లబ్ వేదికగా ఆమె ‘పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ’ పేరుతో తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
“ఇది కేవలం ఓ రాజకీయ పార్టీ కాదు.. ప్రజల సమస్యలపై పోరాడేందుకు నిర్మితమైన ఉద్యమం” అని స్పష్టం చేశారు.
రాజకీయ అనుభవం తనకు లేకపోయినా, ప్రజల అవసరాలే ఈ నిర్ణయానికి ప్రేరణగా నిలిచాయని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్‌పై పరోక్ష విమర్శలు
రెహమ్ ఖాన్, “ఒకప్పుడు ఓ వ్యక్తి కోసం రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఈసారి, అది నా స్వంత నిర్ణయం. ప్రజల కోసం, నిస్వార్థంగా ముందుకు వస్తున్నాను,” అంటూ ఇమ్రాన్ ఖాన్‌ను పరోక్షంగా విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం గాక, సుస్థిరమైన పాలన కోసం తాను రంగప్రవేశం చేశానని స్పష్టం చేశారు.
ప్రజల్లో పెరుగుతున్న నిరాశే ప్రేరణ
ప్రస్తుత పాలక వ్యవస్థపై ప్రజల్లో పెరిగిన నిరాశ, అవసరాలపై అధికారుల నిర్లక్ష్యమే తన రాజకీయ ప్రస్థానానికి బలమైన ప్రేరణగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.
“2012 నుండి ఈ దేశంలో తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులు కూడా అందడం లేదంటే ఎంత దారుణమైన పరిస్థితి?” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ పాలనపై ఘాటు విమర్శలు
రెహమ్ ఖాన్, పాక్ రాజకీయాల్లో కుటుంబ పాలన వృద్ధిపరచడం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. “దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరం ఉంది. ఎలాంటి రాజకీయ బ్యాకప్ లేకుండానే నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను,” అని తెలిపారు. త్వరలో తమ పార్టీ ముఖ్యమైన మేనిఫెస్టోను విడుదల చేస్తామని కూడా వెల్లడించారు.
కరాచీపై ప్రేమాభిమానాలు వ్యక్తం
పార్టీ ప్రకటన సందర్భంగా కరాచీ నగరంపై ప్రత్యేక అభిమానం చూపారు.
“బాధల సమయంలో ఈ నగరం నాకు ఆశ్రయమిచ్చింది.. ధైర్యం ఇచ్చింది. కాబట్టి ఇదే నా కొత్త ప్రయాణానికి అంకురస్థలం,” అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.