Operation Sindoor: IC-814 విమానం హైజాక్ మాస్టర్‌మైండ్ అజహర్ హతం
భారత సాయుధ దళాల విన్యాసంతో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది.
Operation Sindoor: IC-814 విమానం హైజాక్ మాస్టర్‌మైండ్ అజహర్ హతం.?
Operation Sindoor: భారత సాయుధ దళాల విన్యాసంతో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. పాక్‌లోని బహావల్‌పుర్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్‌పై జరిగిన దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన కీలక శక్తులు లక్ష్యంగా మారాయి. దాడిలో మసూద్ అజహర్ కుటుంబానికి చెందిన పలువురు సహా మొత్తం 14 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇందులో అతడి సోదరుడు, ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ కూడా హతమయ్యినట్టు సమాచారం.
అబ్దుల్ రవూఫ్ అజహర్ పేరు పలు ఉగ్రదాడుల్లో వినిపించింది. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC-814 విమానం హైజాక్ ఘటనకు ఇతడే మాస్టర్ మైండ్‌గా చెబుతారు. ఆ ఘటనలో మసూద్ అజహర్ సహా ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయించి కాందహార్ నుంచి పాకిస్థాన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాతే జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ ఏర్పడింది.
అంతేకాక, 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడిలోనూ, 2016 పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ అటాక్‌లోనూ, 2019 పుల్వామా దాడిలోనూ రవూఫ్ పాత్రపై అనుమానాలు వెలుగు చూశాయి. అమెరికా జర్నలిస్టు డేనియల్ పెర్ల్ హత్యలో కూడా ఇతడి ప్రమేయం ఉందని న్యూయార్క్ టైమ్స్ సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. 2002లో పాకిస్థాన్‌లో పెర్ల్‌ను ఒమర్ షేక్ అనే ఉగ్రవాది కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఒమర్‌ను కూడా 1999 హైజాక్ ఉదంతంలో భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది.