నడక మర్చిపోయా.. సునీతా విలియమ్స్ షాకింగ్ కామెంట్స్
ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ పలు సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయారు. ఆమెను భూమి మీదకు ఈ ఏడాది మార్చిలో తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా అంతరిక్షం నుంచి విద్యార్థులతో మాట్లాడిన సునీతా విలియమ్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి ఉండడం వల్ల కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టంగానే ఉందన్నారు. తాను ప్రస్తుతం నడక కూడా మర్చిపోయానని.. తాను బాల్యంలో మాదిరిగా నడక నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.
నెలల తరబడి అంతరిక్షంలో ఉంటున్న తాను నడవలేదని, కూర్చోలేదని, కనీసం పడుకోని విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేకపోయిందన్నారు. జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతున్నానని.. దీనివల్ల నేలపై నడిచిన అనుభూతిని గుర్తుతెచ్చుకోలేకపోతున్నానన్నారు. తమ మిషన్ ప్రకారం నెల రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి రావాలి. కానీ ఇంతకాలం ఇక్కడ ఉండడం కొంచెం షాకింగ్ గా అనిపిస్తోందన్నారు సునీతా విలియమ్స్.
ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ గత జూన్ 6న బోయింగ్ స్టార్ లైన్ స్పేస్ షిప్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. నిజానికి జూన్ 14న వారిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సిఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దాంతో వారు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు.
అయితే వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను సాయం కోరారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ తనను కోరినట్టు మస్క్ తాజాగా తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. బైడెన్ నిర్లక్ష్యం కారణంగా వ్యోమగాములు నెలలుగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు
. ఆ ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్టు మస్క్ తెలిపారు. అధ్యక్షుడి అభ్యర్థన మేరకు త్వరలో ఆ పని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక వారిని భూమిపైకి తీసుకొచ్చే చర్యలను వేగవంతం అవుతున్నట్టు తెలుస్తోంది. మార్చి లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు తిరిగి భూమిపైకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.