తీవ్రంగా నష్టపోయిన ఇజ్రాయెల్, గాజా యుద్ధానికి రెండేళ్లు

గాజా యుద్ధానికి సరిగ్గా రెండేళ్లు.. 2023 అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ విరుచుకుపడటంతో ప్రారంభమైన ఇజ్రాయెల్, గాజా యుద్ధం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది.

Update: 2025-10-08 09:33 GMT

గాజా యుద్ధానికి సరిగ్గా రెండేళ్లు.. 2023 అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ విరుచుకుపడటంతో ప్రారంభమైన ఇజ్రాయెల్, గాజా యుద్ధం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఊహించని విధ్వంసం జరుగుతోంది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బందీలు పూర్తిగా విడుదల కాలేదు. అమెరికా జోక్యంతో ప్రస్తుతం ఈజిప్టులో జరుగుతున్న చర్చలు ఫలిస్తే యుద్ధానికి ముగింపు పలికే అవకాశముంది. లేదంటే మరింత కాలం విధ్వంసం తప్పదు. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో ప్రజలు రెండుగా చీలిపోయారు. బందీలను విడిపించడంలో ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు విఫలమయ్యారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కాల్పుల విరమణ కుదుర్చుకోవడంలో ఆయన సరిగా వ్యవహరించలేదని విమర్శిస్తున్నారు.

ఇక గాజాలో పెను విధ్వంసమే జరిగింది. 67వేల మందికిపైగా మరణించారు. పలు పట్టణాలు, నగరాలు ధ్వంసమయ్యాయి. లక్షల మందికి నిలువనీడ లేకుండా పోయింది. తినడానికీ తిండి దొరకడం లేదు. ఇజ్రాయెల్‌ చరిత్రలోనే హమాస్‌ అతి పెద్ద దాడి చేసింది. రాకెట్లతో విరుచుకుపడి 1,200 మందిని హతమార్చింది. సైనిక స్థావరాలు, వ్యవసాయ కమ్యూనిటీలు, అవుట్‌డోర్‌ సంగీత కచేరీ వంటి వాటిపై దాడులు జరిగాయి. 251 మందిని హమాస్‌ మిలిటెంట్లు అపహరించుకుపోయారు. ఆ తర్వాత యుద్ధం కొనసాగుతున్న కాలంలో తాత్కాలిక కాల్పుల విరమణ ద్వారా చాలా మందిని హమాస్‌ విడిచిపెట్టింది. ఇంకా 48 మంది బందీలుగా ఉన్నారు. గాజాతో యుద్ధం అంతటితో ఆగలేదు. ఇరాన్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, యెమెన్‌లోని హూతీలతో ఇజ్రాయెల్‌ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధ కాలంలోనే పలు మిలిటెంట్‌ గ్రూపుల నేతలను ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది. కొంత మంది ఇరాన్‌ జనరల్స్‌నూ హతమార్చింది. గాజాలో ఇప్పటికీ వేల మంది జాడ తెలియడం లేదు. లక్షల మంది ఇజ్రాయెల్‌ బాంబు దాడుల్లో గాయపడ్డారు. 6,000 మంది శిథిలాల కిందే సమాధయ్యారని అంటున్నారు.

గాజాలోని 21 లక్షల మంది యుద్ధం కారణంగా ప్రభావితమయ్యారు. 365 చదరపు కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం చోటుచేసుకుంది. ప్రతి 10 మందిలో ఒకరు చనిపోవడంగానీ, గాయపడటంగానీ జరిగింది. ప్రతి 10 మందిలో ముగ్గురు రోజులపాటు ఆహారానికి దూరమయ్యారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో నలుగురు.. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారు. ప్రతి 10 భవనాల్లో 8 ధ్వంసమయ్యాయి. మొత్తంగా 1,02,067 భవనాలు శిథిలమయ్యాయి. ప్రతి 10 ఎకరాల వ్యవసాయ భూముల్లో 8 ఎకరాలు పనికిరాకుండా పోయాయి. ఆహారం కోసం క్యూలలో నిల్చున్న వారిలో 2,000 మంది అక్కడ జరిగిన ఘర్షణల్లో మరణించారు. 30శాతం మందికి ఆహారం అందలేదు. హమాస్‌ మెరుపు దాడులు, ఇజ్రాయెల్‌ సేనల ప్రతీకార దాడులతో మొదలైన ఈ పోరు.. గాజాలో తీరని నష్టాన్ని మిగిల్చింది. 67 వేలమంది మృతి చెందగా.. లక్ష భవనాలు ధ్వంసమయ్యాయి. గాజాలో జరిగిన రెండేళ్ల విధ్వంసం ఇది. 

Tags:    

Similar News