Pakistan Airspace: ఇండియా నుండి అమెరికా వెళ్ళే విమానాలు యూరప్‌లో దిగక తప్పడం లేదు.. ఎందుకంటే..
Pahalgam Attack: పహల్గం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ కు బుద్ధి చెబుతూ భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ కటినంగా వ్యవహరిస్తుండటాన్నీ పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది.
ఈ క్రమంలోనే పాకిస్థాన్ తమ దేశ గగనతలంపై ఆంక్షలు విధించింది. దీంతో భారత్ నుండి ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళే విమానాలు పాకిస్తాన్ మీదుగా కాకుండా పాకిస్థాన్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీ నుండి వెళ్ళే విమానాలపై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది.
ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళే విమానాలు పాకిస్తాన్ చుట్టూ తిరిగి వెళ్ళడం వల్ల అంతకు ముందు కంటే ఇప్పుడు 4 గంటల ఎక్కువ సమయం పడుతోంది. అంతేకాకుండా అమెరికా వరకు వెళ్ళే విమానాలు దారి మధ్యలో యూరప్ లో ఆగి ఇంధనాన్ని నింపుకోవాలి వస్తోంది. ఫలితంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి 4 గంటలు ఆలస్యం అవుతోంది.
ఇండియా నుండి ఫ్లైట్ సర్వీసెస్ అందిస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఎయిర్ లైన్స్ సంస్థలపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కజకిస్థాన్, ఉబ్జెకిస్తాన్ లాంటి దేశాలకు ఇండిగో విమాన సేవలు నిలిపేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మే 7 వరకు ఆయా రూట్లలో ఇండిగో విమాన సేవలు రద్దు చేసినట్లుగా సీఎన్బీసీ వార్త కథనం పేర్కొంది.