Donald Trump's Tariffs: ఎట్టకేలకు భారత్ దిగొచ్చింది... ఎందుకంటే - అమెరికన్ మీడియాతో ట్రంప్

Update: 2025-03-08 08:10 GMT

Donald Trump's Tariffs: ఎట్టకేలకు భారత్ దిగొచ్చింది... ఎందుకంటే - అమెరికన్ మీడియాతో ట్రంప్

Donald Trump's Tariffs: భారత్‌పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అమెరికా ఎగుమతులపై భారత్ ఎక్కువ సుంకం వసూలు చేసిందన్నారు. ఇండియాలో అమెరికా ఏదీ అమ్మే పరిస్థితి లేదన్నారు. అయితే, తాజాగా ఆ సుంకాన్ని తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ అమెరికన్ మీడియాకు తెలిపారు. ఎట్టకేలకు, అమెరికా పట్ల ఇంతకాలంపాటు భారత్ వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని ఒకరు బయటపెడుతుండటంతో ఆ దేశం కూడా సుంకం తగ్గించేందుకు సిద్ధమైందని తెలిపారు. శుక్రవారం వైట్ హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

డోనల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోక ముందు నుండీ అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం విషయంలో భారత్‌పై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ విమర్శల జోరు ఇంకా పెరిగింది.

అమెరికా అధ్యక్షుడయ్యాకా తొలిసారిగా మార్చి 4న ఉభయ సభలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఈ ప్రసంగంలోనూ ఆయన ఇండియాపై అనేక ఆరోపణలు చేశారు. చైనా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలు అమెరికా నుండి ఎక్కువ సుంకం వసూలు చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో అమెరికా పట్ల భారత్ వైఖరి ముందు నుండీ ఇలాగే ఉందన్నారు.

ఇంతకాలం పాటు ప్రపంచ దేశాలు అమెరికాపై ఎక్కువ సుంకం వసూలు చేసి తమ దేశం నుండి లబ్ధి పొందాయి. ఇకపై ఆయా దేశాలపై అమెరికా ఎక్కువ సుంకం వసూలు చేసి మళ్లీ పూర్వ వైభవం సొంతం చేసుకుంటుందన్నారు. అమెరికా ఉత్పత్తులపై ఏ దేశం ఎంత ఎక్కువ సుంకం విధిస్తే... అమెరికా కూడా వారిపై అంతే ఎక్కువ సుంకం విధిస్తుందని చెప్పారు. అమెరికాకు ఇక స్వర్ణ యుగం మొదలైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

వాణిజ్యంలో అమెరికా - భారత్ మధ్య ఎంత వ్యత్యాసం?

2024 లో అమెరికాకు భారత్ 87.4 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుండి భారత్ 42 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది. ఇది అమెరికాకు భారత్ ఎగుమతి చేసిన 87.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం కంటే 45.7 బిలియన్ డాలర్లు తక్కువ. ఈ వ్యాత్యాసాన్నే డోనల్డ్ ట్రంప్ హైలైట్ చేస్తున్నారు. ఏ దేశమైనా సరే అమెరికాకు ఎంత ఎగుమతి చేస్తోందో అంతే మొత్తంలో దిగుమతి వ్యాపారం కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో అమెరికా ఉత్పత్తులపై విధించే సుంకం కూడా తక్కువగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆయా దేశాలతో ట్రేడ్ వార్ తప్పదని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. 

Tags:    

Similar News