China: చైనా రహస్య ప్రయోగం

*భూమిని చుట్టేసిన హైపర్‌సోనిక్ క్షిపణి *గురితప్పినా.. సత్తా చాటిన హైపర్‌సోనిక్ అస్త్రం

Update: 2021-10-18 04:40 GMT

హైపర్ సోనిక్ క్షిపణి (ఫైల్ ఫోటో)

China: చైనా తాజాగా చేసిన ఓ రహస్య ప్రయోగం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మిస్సైల్ భూ కక్ష్యలోకి పయనించి మొత్తం భూమిని చుట్టేసి, తర్వాత కిందికి దిగి లక్ష్యం వైపు దూసుకెళ్లింది. అయితే, కొద్దిలో గురితప్పినా ప్రమాదకరమైన క్షిపణి రూపకల్పనలో డ్రాగన్ చాలావరకూ పట్టు సాధించినట్లు తెలుస్తోంది. ఈ రంగంలో చైనా పురోగతి, అమెరికా నిఘా వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమ అంచనాలను మించి డ్రాగన్ ముందడుగు వేసినట్లు తెలుసుకొని విస్తుపోయింది.

అయితే ఈ పరీక్ష ఆగస్టులో జరిగింది. ఈ విషయాన్ని చైనా అత్యంత గోప్యంగా ఉంచినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా పరీక్షించిన హైపర్ సోనిక్ క్షిపణి నిర్దేశిత లక్ష్యానికి కేవలం 32 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. అయినా ఇది అంత ఆషామాషీ విషయం కాదు. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇది జరగడం గమనార్హం.

ప్రస్తుతం ఇలాంటి హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థలు రష్యా, చైనా, అమెరికా, ఉత్తర కోరియా దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఇండియా, జపాన్, ఫ్రాన్స్, అస్ట్రేలియా, జర్మనీ వీటిపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇక రష్యా తయారు చేసిన హైపర్‌సోనిక్ క్షిపణి ధ్వని వేగం కన్నా 27 రేట్ల వేగంతో ప్రయాణం చేయగలదు. ప్రపంచంలోనే అత్యంత వేగంతో దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. ఇది భారత్ వద్ద ఉంది. ఈ క్షిపణి కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని రాబోయే నాలుగైదేళ్లలో తయారు చేస్తామని ఇండియా చెబుతుంది.

Tags:    

Similar News