దావోస్‌లో చంద్రబాబు,రేవంత్ రెడ్డి భేటీ: ఏం మాట్లాడుకున్నారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ జ్యురిచ్ విమానాశ్రయంలో జనవరి 20న బేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ జ్యురిచ్ విమానాశ్రయంలో జనవరి 20న బేటీ అయ్యారు. తమ తమ రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ టూర్ కు వెళ్లారు. సింగపూర్ పర్యటన ముగించుకొని దావోస్ వెళ్లారు రేవంత్ రెడ్డి. జనవరి 19న దిల్లీ నుంచి చంద్రబాబు నేరుగా దావోస్ వెళ్లారు. జ్యురిచ్ ఎయిర్ పోర్టులో రెండు రాష్ట్రాల సీఎంలు కలుసుకున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఏపీ మంత్రి లోకేష్ కూడా సమావేశమయ్యారు.
రెండు రాష్ట్రాల్లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రులు ఆహ్వానించనున్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగే అభివృద్ది కార్యక్రమాలపై సీఎంల మధ్య చర్చ జరిగిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నఅవకాశాలను ప్రపంచ ఆర్ధిక సదస్సులో సీఎంలు ప్రస్తావించనున్నారు. తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ తో చంద్రబాబు డిన్నర్ మీట్లో పాల్గొంటారు. కోకాకోలా, ఎల్ జీ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం కానున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు పెట్టుబడిదారులకు తమ రాష్ట్రాలు ఇచ్చే రాయితీలను కూడా ఈ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు. పెట్టుబడులు వస్తే తమ రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా దావోస్ కు వెళ్లారు.