India Student: కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు..!!
India Student: కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు..!!
India Student: కెనడాలో దారుణం జరిగింది. భారత విద్యార్థిని కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటనపై టొరంటోని భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ లో ఓ ప్రకటనను విడుదల చేసింది.
కెనడాలోని టొరంటో నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి శివంక్ అవస్థీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. టొరంటో విశ్వవిద్యాలయంలోని స్కార్‌బరో క్యాంపస్ సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల వయసున్న శివంక్ అవస్థీ అక్కడ డాక్టరేట్ చదువుతున్న విద్యార్థి. ఈ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ గురువారం అధికారికంగా తీవ్ర దిగ్భ్రాంతి చేస్తూ.. సంతాపం వ్యక్తం చేసింది.
టొరంటో విశ్వవిద్యాలయంలోని స్కార్‌బరో క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో యువ భారతీయ డాక్టరేట్ విద్యార్థి శివంక్ అవస్థీ విషాదకరంగా మృతి చెందడం మాకు తీవ్ర వేదన కలిగిస్తోంది అని భారత కాన్సులేట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని.. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని కాన్సులేట్ స్పష్టం చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డిసెంబర్ 23న హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్ ప్రాంతంలో శివంక్ అవస్థీపై కాల్పులు జరిగాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయాలతో నేలపై పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు. తీవ్ర గాయాల కారణంగా శివంక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా స్కార్‌బరో క్యాంపస్‌ను మూసివేశారు. ఈ హత్య ఈ ఏడాది టొరంటో నగరంలో నమోదైన 41వ హత్యగా గుర్తించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే పట్టపగలు జరిగిన ఈ కాల్పుల ఘటన విద్యార్థుల్లో తీవ్ర భయం, ఆందోళనతో పాటు ఆగ్రహాన్ని కూడా రేకెత్తించింది. రెడ్డిట్‌లో చేసిన ఒక పోస్టులో.. క్యాంపస్‌లోని వ్యాలీ ప్రాంతం విద్యార్థులు తరచుగా ఉపయోగించే ప్రదేశమని.. అలాంటి చోటే పట్టపగలు శివంక్ అవస్థీని కాల్చి చంపడం షాకింగ్‌గా ఉందని ఒక విద్యార్థి వ్యాఖ్యానించాడు. శివంక్ అవస్థీని మూడవ సంవత్సరం లైఫ్ సైన్సెస్ విద్యార్థిగా అధికారులు గుర్తించారు.