Morocco Earthquake: మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం.. 632కి పెరిగిన మృతుల సంఖ్య

Morocco Earthquake: మరో 329మందికి గాయాలు, మృతుల సంఖ్య ఇంకాస్త పెరిగే ఛాన్స్

Update: 2023-09-09 09:39 GMT

Morocco Earthquake: మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం.. 632కి పెరిగిన మృతుల సంఖ్య

Morocco Earthquake: ప్రకృతి ప్రకోపానికి మొరాకో దేశం తల్లడిల్లింది. భారీ భూకంపానికి అతలాకుతలం అయింది. మాటలకు అందని ఈ మహా విషాదంలో.. 650మందికిపైగా ప్రాణాలు విడిచారు. మరో 329 మంది గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం వెల్లడించింది. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంపానికి.. భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కిందే ప్రజలు సమాధి అయ్యారు. భారీ సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి.

పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.8గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్‌ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్‌ హౌజ్‌, మర్రాకేశ్‌, అజిలాల్‌ సహా పలు ప్రాంతాలు ఈ భూకంప ధాటికి వణికిపోయాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. అర్ధరాత్రి కావడంతో ప్రజలు గాఢనిద్రలో ఉండడంతో మృత్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే.. భవన శిథిలాలు మీద పడి చాలా మంది ప్రాణాలు విడిచారు. ఇంకొంతమంది.. ప్రాణభయంతో కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు.

భూకంపం సంభవించిన ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మృతుల బంధువుల ఆహకారాలు మిన్నంటాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. దేశం గతంలో ఎన్నడూ ఈస్థాయి భూకంపాన్ని చూడలేదని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మొరాకోలో భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసిపనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని జీ20 ప్రారంభోపన్యాసంలో కూడా మోదీ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News