2వేల మంది తాలిబాన్ ఖైదీల విడుదల

ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2020-05-25 14:24 GMT
Ashraf Ghani (File Photo)

ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 వేల మంది తాలిబాన్ ఖైదీలను "సత్ప్రవర్తనా నియమావళి" కింద విడుదల చేసే ప్రక్రియను ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్రారంభించారు, ఈద్ పండగను పురష్కారించుకొని వీరిని విడుదల చెయ్యాలని నిర్ణయించారు. మరోవైపు ఈద్ పండగ సందర్భంగా మూడు రోజులపాటు ఆఫ్ఘన్ తాలిబన్లు కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను ఆఫ్ఘన్ ప్రభుత్వం తోపాటు ఐక్యరాజ్యసమితి కూడా స్వాగతించింది. కాగా ఖైదీలను విడుదల చేయాలనే నిర్ణయం "శాంతి ప్రక్రియ విజయవంతం కావడానికి" తీసుకోబడింది అని ఘని ప్రతినిధి సెడిక్ సెడిక్కి తెలిపారు.

ఇదిలావుంటే ఖతార్ రాజధాని దోహాలో ఫిబ్రవరిలో సంతకం చేసిన యుఎస్-తాలిబాన్ ఒప్పందం ప్రకారం, ఆఫ్ఘన్ ప్రభుత్వం 5,000 మంది తాలిబాన్ ఖైదీలను విడుదల చేయాలనీ, తాలిబాన్ నిర్బంధంలో ఉన్న 1,000 మంది ఆఫ్ఘన్ భద్రతా దళాల సిబ్బందిని విడిపించాలని ఉంది. కాబూల్ ఇప్పటికే సుమారు 1,000 మంది తాలిబాన్ ఖైదీలను విడుదల చేయగా, తాలిబాన్ కూడా ఆఫ్ఘన్ భద్రతా దళాలలో సుమారు 300 మంది సభ్యులను విడిపించిందని నివేదికలు చెబుతున్నాయి. ఖైదీలను విడిచిపెట్టడానికి తాము కట్టుబడి ఉన్నామని తాలిబాన్ చెబుతూనే, దోహాలో ఒప్పందం ప్రకారం తమ సభ్యులలో 5,000 మందిని విడుదల చేయాలన్న విషయాన్నీ కూడా గుర్తు చేసింది.


Tags:    

Similar News