బద్దలైన అగ్నిపర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం

Iceland: నెల రోజుల వ్యవధిలోనే మరోసారి బద్దలైన అగ్నిపర్వతం

Update: 2024-01-16 02:36 GMT

బద్దలైన అగ్నిపర్వతం.. ఇళ్లపైకి లావా ప్రవాహం

Iceland: ఐస్‌ల్యాండ్‌లో రెక్జానెస్‌ ద్వీపకల్పంలో అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా జనావాసాలకు చేరింది. దీంతో సమీపంలోని గ్రిండావిక్‌ ప్రాంతంలో ఇళ్లు కాలిబూడిదయ్యాయి. దీనిని ఐస్‌ల్యాండ్‌ ప్రధాని కాట్రిన్‌ ధ్రువీకరించి.. గ్రిండావిక్‌కు ఇది చీకటి దినమని వ్యాఖ్యానించారు. స్థానికులు సమష్టిగా పనిచేసి ముప్పు నుంచి బయటపడాలని సూచించారు.

అగ్నిపర్వతం బద్దలైతే ఇక్కడికి లావా రావచ్చనే భయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే స్థానికంగా రాళ్లతో ఎత్తైన గట్టును ముందుగానే నిర్మించారు. కానీ, దానిని దాటుకొని లావా ఊళ్లోకి ప్రవేశించింది. దీంతో స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వీరితోపాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు.

దాదాపు నెల రోజుల వ్యవధిలో ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం బద్దలవడం ఇది రెండోసారి. ఈ దేశంలోని పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుకింగ్స్‌ను నిలిపివేసింది. ప్రస్తుతం లావా వ్యాపిస్తున్న ప్రదేశానికి ఇది చాలా దూరంలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 800 సార్లు భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. గతంలోనూ ఇలాగే జరగినప్పటికీ.. అప్పుడు జనావాసాల్లోకి లావా రాలేదని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News