రైతన్నలకు శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్.. ఒకసారి వరి నాటితే ఎనిమిది సార్లు కోత..

PR23: రైతన్నలకు చైనా శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ వినిపించారు. ఒకసారి వరి నారు నాటి.. నాలుగేళ్లు రిలాక్స్ అయిపోవచ్చని రైతులకు హామీ ఇచ్చారు.

Update: 2022-12-05 15:00 GMT

రైతన్నలకు శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్.. ఒకసారి వరి నాటితే ఎనిమిది సార్లు కోత..

PR23: రైతన్నలకు చైనా శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ వినిపించారు. ఒకసారి వరి నారు నాటి.. నాలుగేళ్లు రిలాక్స్ అయిపోవచ్చని రైతులకు హామీ ఇచ్చారు. అవును ఇకపై ఒక్కసారి నాటిన వరి నారు.. ఎనిమిది సార్లు కోతకు వస్తుందంటూ నమ్మకశ్యం కాని మాటను చైనా శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసి మరీ చూపించారు. నిజానికి పీఆర్‌-23 పేరుతో నూతన వరి వంగడాన్ని సృష్టించిన ఆ సైంటిస్టులు నాలుగేళ్ల క్రితమే దానిని అక్కడి రైతుల చేతికి ఇచ్చారట. పీఆర్‌-23 రకం వరి నారును ఒకసారి నాటితే వరుసగా ఎనిమిది సీజన్లలో పంట కోతకు వస్తూ అక్కడి రైతులను ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కొక్క సీజన్‌లో ఎకరాకు సగటున 27 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఒకసారి వరి కోసిన తరువాత పిలకలకు నీళ్లు పెడితే మళ్లీ అది ఎదిగి, వరి కంకులు వేస్తుండటంతో రైతుల ఆనందానికి అవదులు లేకుండా పోతున్నాయట. ఇప్పటికే చైనా రైతులు 40 వేల ఎకరాల్లో సాగు చేయగా, మంచి ఫలితాలు ఇవ్వడంతో మిగిలిన రైతులు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు దుక్కి, వరినాట్లకు అయ్యే ఖర్చులతో పాటు నీటి వినియోగం కూడా గణనీయంగా తగ్గుతూ ఉండటం వారికి మరింత ఊరటనిస్తోంది. సాగు నీటి వాడకం 60%, కూలీల ఖర్చు 58%, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యయం 49% వరకు కలిసి వస్తుందని చైనా పరిశోధనల్లో తేలింది. దీంతో పీఆర్‌-23 వంగడం మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలమో కాదో తేల్చేందుకు అధ్యయనం చేయాలని ICAR అంటే.. భారత వ్యవసాయ పరశోధనా మండలి దేశంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థలను ఆదేశించింది. ICAR సూచనలతో రాజేంద్రనగర్‌లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా అధ్యయనం చేస్తుంది.

భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉంది కాబట్టి.. ప్రతి 4 నెలలకు ఒకసారి సీజన్‌ మారుతుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఒకే నెలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, పంటలను తెగుళ్లు చుట్టు ముడుతున్నాయని అంటున్నారు. చైనా ఆహారపు అలవాట్లు, వాతావరణం భారతదేశానికి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. మనం బియ్యంతో అన్నం వండుకుని తింటామని, చైనాలో హైబ్రిడ్‌ బియ్యం లేదా నూకలతో జావలా కాచి తాగుతారని వివరించారు. దీంతో మనదేశ వాతావరణం, ఇక్కడి భూములు, ఆహార అలవాట్లు తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే కొత్త వంగడాల సాగును అనుమతించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఒకవేళ ఈ వరి వంగడం భారతదేశంలోనూ కూడా వస్తే తెలుగు రాష్ట్రాల రైతులకు నిజంగా శుభవార్తే అవుతుంది. ఎందుకంటే అన్నదాతలు వరి పంట పైనే ఎక్కువ ఆధారపడతారు. కందులు, రాగులు, మొక్కజొన్న, చెరకు వంటి పంటలు పండిస్తున్నా మెజార్టీ రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతారు. ఇప్పుడు చైనా వంగడంతో ఇలాంటి వారందికి తక్కువ పెట్టుబడి, శ్రమ తగ్గడంతో పాటు బోలెడంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ న్యూస్ విన్న దగ్గర నుంచీ.. ICAR గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం వెంటనే.. తెలుగు రాష్ట్రాల రైతన్నలు.. ఈ సాగును మొదలెట్టేయాలన్న ఆత్రంలో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, ఎరువులు, విత్తనాల సరఫరాలో అధికారుల నిర్లక్ష్యంతో.. నిలువునా మునిగిపోతున్న రైతులకు ఈ వంగడం ఓ వరమే అంటున్నారు నిపుణులు. ఈ వంగడం మనదేశంలో కూడా సూటబుల్ అనే గుడ్ న్యూస్‌ను సైంటిస్టులు వినిపించాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. 

Tags:    

Similar News