Fish Farming: చేపల పెంపకంలో రాణిస్తున్న రిటైర్డ్ టీచర్

Fish Farming: భారతదేశంలో అత్యధికమంది ఇష్టపడే చేపల్లో బొమ్మె చేప ఒకటి.

Update: 2021-10-07 09:52 GMT

Fish Farming: చేపల పెంపకంలో రాణిస్తున్న రిటైర్డ్ టీచర్

Fish Farming: భారతదేశంలో అత్యధికమంది ఇష్టపడే చేపల్లో బొమ్మె చేప ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్ర చేప. దీన్ని కొర్రమీను అని కూడా పిలుస్తారు. ఈ చేప మాంసాహారి. చిన్నచిన్న నీటి కుంటలు, చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లలో ఎక్కువగా లభిస్తాయి. బలమైన మాంసం, అద్భుతమైన రుచి, తక్కువ ముళ్లు ఉండటం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ చేప సొంతం. ఆ ప్రత్యేకతను గుర్తించే ఉపాధ్యాయుడిగా రిటైర్డ్‌ అయిన కరీంనగర్ జిల్లాకు చెందిన రాజయ్య వ్యవసాయ అనుబంధ రంగాలవైపు ఆసక్తి చూపారు. సహజ సిద్ధమైన పద్ధతుల్లో బొమ్మె చాపల పెంపకం ప్రారంభించారు. చిగురుమామిడిలో ఏడున్నర ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని అందులో 5 ఎకరాల్లో సమగ్ర సేద్యంచేస్తున్నారు. ఇందులో భాగంగా రెండున్నర ఎకరాల్లో చేపలను పెంచుతున్నారు.

రాహు , కట్ల, బంగారు తీగ వంటి తెల్ల చేపలతో పాటు పెద్ద మొత్తంలో బొమ్మె చేపలను పెంచుతున్నారు రాజయ్య. బొమ్మె చేపల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు ఈ పెంపకందారు. హైబ్రిడ్‌లపై ఆధారపడకుండా సహజ సిద్ధంగా ఉత్పత్తి అయిన చేపపిల్లలనే పెంపకానికి వినియోగిస్తున్నారు. సాధారణంగా బొమ్మె చేపలు మాంసాహారీ కానీ కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటించి వాటిని శాఖాహారిగా మార్చి పెంచుతున్నారు. చేపలు సహజ సిద్ధంగా పెరగాలన్న ఉద్దేశంతో నాలుగున్నర నుంచి ఐదు ఫీట్ల లోతుతో చెరువును తవ్వుకున్నారు. గట్లను ఏర్పాటు చేసుకున్నారు. చేపలు చెరువులో వదలడానికి ముందుగానే వాటికి అనుకూలమైన వాతావరణన్నా ఏర్పాటు చేసుకుంటున్నారు. నీటిలో అమ్మోనియా, పీహెచ్‌ స్థాయిలను గమనించి చేపలను వదులుతున్నారు.

ఎకరానికి 10 వేల నుంచి 12 వేల చేపలు సాగుబడి చేయవచ్చంటున్నారు రాజయ్య. అంతకు మించి చేపలను పెంచితే రైతుకు నష్టం ఏర్పడే అవకాశం ఉటుందంటున్నారు. స్థలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపలను వదులుకోవాలని సూచిస్తున్నారు. అదే విధంగా చెరువులో విధిగా నాచు వేసుకోవాలని అంటున్నారు. అలాగే ఒడ్డుపైన గడ్డిని పెంచుకోవాలంటున్నారు. ఇలా చేయడం వల్ల చేపలు సహజ సిద్ధంగా పెరుగుతున్నాయన్న భావనకు వచ్చి త్వరగా పట్టుబడికి వస్తాయంటున్నారు.

పొలంలోనే హ్యాచరీ, నర్సరీ, గ్రో అవుట్ పాయింట్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ రైతు. అపుడే పుట్టిన చేప పిల్లల నుంచి అవి పట్టుబడికి వచ్చే వరకు సురక్షిమైన వాతారణాన్ని కల్పిస్తున్నారు. వాటికి కావాల్సిన ఆహారాన్ని సమయానుకూలంగా అందిస్తూ చక్కటి దిగుబడిని సొంతం చేసుకుంటున్నారు.

కొత్తగా బొమ్మె చేపల పెంపకం వైపు వచ్చేవారు రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు ఈ రైతు. నాణ్యమైన సహజ సిద్ధమైన చేప పిల్లలను ఎంపిక చేసుకోవడం అనేది ప్రధానమైన అంశమని చెబుతున్నారు. అదే విధంగా స్థలం అనుకూలమా కాదా అన్నది పరిశీలించుకుని, నీటి సౌకర్యం ఎలా ఉందో గమనించుకుని , నేల స్వభావాన్ని తెలుసుకుని పెంపకం మొదలు పెట్టాలంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఇప్పుడు నీటి లభ్యత పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపల రంగాన్ని బలపరిచేందుకు రిజర్వాయర్లలో ఉచితంగా చేపలను వదలటంతో పాటు, మత్స్యకారులకు వివిధ రకాల సబ్సిడీలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. అయితే ప్రభుత్వం రాహు, బొచ్చ, కట్ల వంటి తెల్ల చేపలను ఉచితంగా అందిస్తోందని ఆ స్థానంలో తెలంగాణ చేపైన బొమ్మె చేపను అందిస్తే రాష్ట్ర బ్రాండ్ దేశవ్యాప్తంగా కనబడుతుందని రైతు చెబుతున్నాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి బొమ్మె చేప ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలంటున్నారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను, కరెంటుతో పాటు సబ్సిడీలను అందిస్తే ప్రతి గ్రామంలో చేపల పెంపకం జరుగుతుందని తద్వారా దేశ అవసరాలకు సరిపడా బొమ్మె చేపలను అందించే సామర్ధ్యం పెరుగుతుందంటున్నారు. 

Full View


Tags:    

Similar News