Farming : వరి, పత్తి వద్దు.. తమలపాకు ముద్దు! కోట్లు కురిపిస్తున్న కలకత్తా 'తేజ్ పత్తా' సాగు.
Farming : తక్కువ ఖర్చుతో అధిక లాభాలు.. రైతులకు బంగారు భవిష్యత్తు చూపిస్తున్న ‘తేజ్ పత్తా’ పంట
Farming : వరి, పత్తి వద్దు.. తమలపాకు ముద్దు! కోట్లు కురిపిస్తున్న కలకత్తా 'తేజ్ పత్తా' సాగు.
Calcutta Betel Leaf: పాన్ ప్రియులకు కలకత్తా పాన్ అంటే ప్రాణం. ఆ పాన్‌కు అంతటి ప్రత్యేకత రావడానికి కారణం అందులో వాడే తేజ్ పత్తా (కలకత్తా తమలపాకు). సాధారణంగా ఈ ఆకులు మన వాతావరణంలో పండవు అనే అపోహ ఉంది. కానీ, సరైన మెలకువలు, అంకితభావం ఉంటే తెలంగాణ గడ్డపై కూడా ఈ బంగారు పంటను సాగు చేయవచ్చని నిరూపితమైంది. ఉత్తర తెలంగాణలోని కాగజ్‌నగర్ డివిజన్ ఇప్పుడు ఈ విశిష్ట సాగుకు వేదికగా మారింది.
కలకత్తా తమలపాకు సాగు సాధారణ పంటల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ తీగలకు నేరుగా సూర్యరశ్మి తగిలితే ఆకులు ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ముడుల పందిరి పద్ధతిలో సాగు చేస్తారు.తీగలపై ఎండ పడకుండా పైన పందిరి వేయాలి. ఖరీదైన గ్రీన్ మాట్‌లకు బదులుగా ఈత కొమ్మలతో తక్కువ ఖర్చుతో పందిరి వేసి పొలాన్ని చల్లగా ఉంచవచ్చు.పొలం చుట్టూ రక్షణగా వెదురు, మునగ, లేదా చెరుకు మొక్కలు పెంచడం ద్వారా వేడి గాలుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.ఈ తీగలను నేలపై పారించకుండా వెదురు బద్దలు లేదా కర్రల సాయంతో నిటారుగా పైకి పాకించాలి.
అరెకరం పొలంలో ఈ సాగు మొదలుపెట్టడానికి సుమారు రూ. 60 వేల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఈ పంటకు ప్రధాన బలం ఆవాల పిప్పి . ఆవాల నుంచి నూనె తీశాక మిగిలిన పిప్పిని ప్రతి మూడు వారాలకు ఒకసారి ఎరువుగా వేయాలి. మన దగ్గర ఇది దొరకకపోయినా, పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకుని వాడటం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుంది.
ఒకసారి మొక్కలు ఎదిగిన తర్వాత ఆదాయం నిలకడగా ఉంటుంది. మార్కెట్‌లో కలకత్తా తమలపాకులకు ఉన్న గిరాకీ దృష్ట్యా లాభాలు ఆశాజనకంగా ఉన్నాయి.వారానికి రెండుసార్లు ఆకులు కోయవచ్చు. ప్రతి కోతకు 2,500 కంటే ఎక్కువ ఆకుల దిగుబడి వస్తుంది. సాధారణ సీజన్లలో ఒక్కో ఆకు 50 పైసల ధర పలుకుతుంది. అదే ఎండాకాలంలో ఆకుల కొరత ఉంటుంది కాబట్టి, ఒక్కో ఆకు రూపాయి వరకు పలుకుతుంది.
ఈ సాగును కేవలం ఒక వ్యవసాయంగానే కాకుండా ఒక సంప్రదాయంగా భావిస్తారు. పొలంలోకి వెళ్లేటప్పుడు స్నానం చేసి, శుచిగా వెళ్లడం వంటి నియమాలు పాటిస్తారు. ఈ అంకితభావమే నాణ్యమైన ఆకులు పండటానికి కారణమవుతుంది. సంప్రదాయ వరి, పత్తి పంటల కంటే భిన్నంగా ఆలోచించి, ఇలాంటి వాణిజ్య పంటలు సాగు చేయడం వల్ల తక్కువ విస్తీర్ణంలోనే ఏడాది పొడవునా గిట్టుబాటు ఆదాయం పొందవచ్చు.