Vegetable Farming: వేసవిలో ఈ కూరగాయలు పండిస్తే కాసుల వర్షమే..!
Summer Vegetable Farming: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నీటి ఎద్దడితో సాగు అంటేనే రైతులు భయపడుతుంటారు. కానీ, తెలివిగా ఆలోచించి సమయానికి తగ్గ పంటలు వేస్తే, ఎండ వేడిమిలోనే లాభాల పంట పండించవచ్చు.
Vegetable Farming: వేసవిలో ఈ కూరగాయలు పండిస్తే కాసుల వర్షమే..!
Summer Vegetable Farming: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నీటి ఎద్దడితో సాగు అంటేనే రైతులు భయపడుతుంటారు. కానీ, తెలివిగా ఆలోచించి సమయానికి తగ్గ పంటలు వేస్తే, ఎండ వేడిమిలోనే లాభాల పంట పండించవచ్చు. వేసవిలో మార్కెట్‌కు కూరగాయల సరఫరా తగ్గుతుంది కాబట్టి, పండించిన ప్రతి గింజకు, కాయకు మంచి ధర లభిస్తుంది. మరి ఈ ఎండలను తట్టుకుని నిలబడే ఆ కూరగాయలేంటో, వాటి సాగులో మెళకువలేంటో తెలుసుకుందాం.
ఎండకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వేడిని తట్టుకునే తీగ జాతి పంటలు సాగు చేయడం అత్యంత లాభదాయకం. దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, బీర, కాకర, సొరకాయ, పొట్లకాయ మరియు దొండ వంటి పంటలు వేసవి వాతావరణంలో ఏపుగా పెరుగుతాయి.చలికాలంలో బీర, కాకర వంటి పంటల ఎదుగుదల మందగిస్తుంది. కానీ, వేసవిలో ఈ మొక్కలు త్వరగా విస్తరించి, అధిక దిగుబడిని ఇస్తాయి.దొండ పంట వేస్తే ఒకసారి నాటిన తర్వాత మూడు నాలుగు ఏళ్ల పాటు నిరంతరాయంగా కాపునిస్తుంది. ఇది రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుంది. తీగ జాతి పంటలను నేలపై కంటే పందిళ్లు వేసి సాగు చేస్తే, కాయలు నేలకు తగలకుండా నాణ్యంగా ఉంటాయి. పురుగుల ఉధృతి కూడా తక్కువగా ఉండి, మార్కెట్‌లో మంచి ధర పలుకుతాయి.
ఆకుకూరలతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం
వేసవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు, తక్కువ విస్తీర్ణంలో ఆకుకూరలు సాగు చేయడం మరో మంచి పద్ధతి. పాలకూర, కొత్తిమీర, చుక్కకూర వంటివి ఎండకు త్వరగా వాడిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. తోటకూర వంటి దేశవాళీ ఆకుకూరలు వేసవిని తట్టుకుంటాయి. మార్కెట్‌లో ఆకుకూరల కొరత ఉంటుంది కాబట్టి, వేసవిలో వీటికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది.
కరివేపాకు.. వేడిని తట్టుకునే కల్పవృక్షం
వేసవి సాగులో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా తట్టుకుని దిగుబడిని ఇస్తుంది. అయితే, దీనికి నీటి సరఫరా క్రమబద్ధంగా ఉండాలి. ఒక్కసారి నాటిన ఆరు నెలల నుంచి కోత మొదలవుతుంది. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి కోత కోస్తూ ఏడాదంతా ఆదాయం పొందవచ్చు.
బంగాళదుంపకు ఇది సమయం కాదు
వేసవిలో సాగు చేసేటప్పుడు ఏ పంట వేయకూడదో కూడా తెలిసి ఉండాలి. బంగాళదుంప పూర్తిగా శీతాకాలపు పంట. దీనికి చల్లని వాతావరణం అవసరం. ఎండలు ఎక్కువగా ఉంటే భూమి లోపల దుంపలు పెరగవు, కేవలం పైన మొక్క మాత్రమే పెరుగుతుంది. కాబట్టి వేసవిలో దీనిని సాగు చేయకపోవడమే మంచిది.
నీటి లభ్యతను బట్టి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటిస్తే, తక్కువ నీటితోనే ఎకరాల్లో కూరగాయలు పండించవచ్చు. మార్కెట్ అవసరాలను గుర్తించి, పందిరి సాగు లేదా తీగ జాతి పంటలను ఎంచుకుంటే, ఈ వేసవిలో మీ పొలం సిరుల మాగాణి కావడం ఖాయం.