CBSE Board Exam Review: ఈ రోజే CBSE 10వ తరగతి సైన్స్ పరీక్ష .. పేపర్ ఎలా ఉందంటే?

మోడరేట్ స్థాయిలో ప్రశ్నలు.. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా, విద్యార్థులకు టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం!

Update: 2026-02-25 11:39 GMT

CBSE Board Exam Review: ఈ రోజే CBSE 10వ తరగతి సైన్స్ పరీక్ష .. పేపర్ ఎలా ఉందంటే?

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన CBSE 10వ తరగతి సైన్స్ బోర్డు పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. ఇటీవలే జరిగిన గణితం పరీక్ష విద్యార్థులను కొంత టెన్షన్‌కు గురిచేయగా, ఈ రోజు జరిగిన సైన్స్ ఎగ్జామ్ మాత్రం విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది. ఈ సందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ.. ఈ ఏడాది వచ్చిన ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఎక్కడా సిలబస్ దాటి పోకుండా, పూర్తిగా NCERT పాఠ్యపుస్తకాలను అనుసరిస్తూ రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు. ఈ పరీక్షపై విద్యార్థుల స్పందన, సబ్జెక్టుల వారీగా లోతైన విశ్లేషణను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ రోజు జరిగిన ఎగ్జామ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాల నుంచి ప్రశ్నలు సిలబస్‌కు అనుగుణంగా వచ్చాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో లాగేనే, ఈసారి కూడా ప్రశ్నలు పూర్తిగా NCERT పాఠ్యపుస్తకాల నుండే వచ్చాయి. ఎవరైతే బేసిక్స్‌పై పట్టు సాధించారో వారు మంచి మార్కులు సాధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులందరూ ఎగ్జామ్‌ను నిర్ణీత 3 గంటల్లోనే పూర్తి చేయగలిగారని చెప్పారు. ఈ రోజు జరిగిన ఎగ్జామ్‌లో జీవశాస్త్రం పేపర్ సింపుల్‌గా అనిపించిందన్నారు. డయాగ్రామ్, లైఫ్ ప్రాసెస్, రీప్రొడక్షన్ చాప్టర్ల నుంచి వచ్చిన ప్రశ్నలు స్కోరింగ్‌గా ఉన్నాయని చెప్పారు. కెమిస్ట్రీ పేపర్ విషయానికి వస్తే.. పేపర్ చాలా స్పష్టంగా ఉందన్నారు. ఫిజిక్స్ పేపర్ కొంచెం ఆలోచింపజేసేలా ఉందన్నారు. ఈ పేపర్‌లో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి విద్యార్థులకు ఆలోచించుకోడానికి కొంత టైం పట్టిందన్నారు.

CBSE బోర్డు పరీక్షలకు అధికారిక సమాధానాలను వెంటనే విడుదల చేయదని నిపుణులు చెప్పారు. విద్యార్థి రాసిన పద్ధతికి, వేసిన బొమ్మలకు విడివిడిగా మార్కులు ఉంటాయని, విద్యార్థులు వారు రాసిన సమాధానాలను రకరకాలుగా వివరించవచ్చు, కాబట్టి అందరిది ఒకే ఫిక్స్‌డ్ సమాధానం ఉండదని, అందుకే రిజల్ట్స్ తర్వాత మాత్రమే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక మార్కింగ్ గైడ్‌లైన్స్‌ను బోర్డు విడుదల చేస్తుందని చెప్పారు. ప్రశ్నపత్రం చాలా పద్ధతిగా ఉందని, కేస్ స్టడీ ప్రశ్నలు విద్యార్థుల ఆలోచనా శక్తిని పరీక్షించేలా ఉన్నాయని చెప్పారు. NCERT, గత ఏడాది ప్రశ్నలను ప్రాక్టీస్ చేసిన వారు కచ్చితంగా ఈ రోజు జరిగిన ఎగ్జామ్‌లో 90% పైగా మార్కులు సాధించగలరని సబ్జెక్ట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News