Anthropic AI : భారత ఐటీ కంపెనీల గుండెల్లో ఆంత్రోపిక్ వణుకు..ఒక్క టూల్‌తో లక్షల కోట్ల సంపద ఆవిరి

భారత ఐటీ కంపెనీల గుండెల్లో ఆంత్రోపిక్ వణుకు..ఒక్క టూల్‌తో లక్షల కోట్ల సంపద ఆవిరి

Update: 2026-02-05 02:40 GMT

Anthropic AI : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో వచ్చిన ఒక కొత్త మార్పు భారత ఐటీ రంగాన్ని కుదిపేసింది. ఆంత్రోపిక్ అనే సంస్థ విడుదల చేసిన ఒక సరికొత్త టూల్ వల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ ఏఐ కంపెనీ ఆంత్రోపిక్ తాజాగా క్లాడ్ కోవర్క్ (Claude Cowork) అనే ఓపెన్ సోర్స్ ప్లగిన్‌ను రిలీజ్ చేసింది. ఇది సాదాసీదా టూల్ కాదు.. లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో సంక్లిష్టమైన పనులను ఆటోమేటిక్ గా చేసేస్తుంది. సాధారణంగా భారత ఐటీ కంపెనీలు (Infosys, TCS వంటివి) విదేశీ క్లయింట్ల కోసం చేసే సర్వీసులను ఈ టూల్ నేరుగా, చాలా తక్కువ ఖర్చుతో చేసేస్తుందనే భయం మార్కెట్‌లో మొదలైంది. దీనివల్ల సాంప్రదాయ ఐటీ సర్వీస్ మోడల్ కు ముప్పు వాటిల్లుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

ఈ టూల్ ప్రభావం బుధవారం భారత స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5.9% పతనమైంది. మార్చి 2020 (కోవిడ్ పీక్) తర్వాత ఐటీ ఇండెక్స్ కి ఇదే అత్యంత దారుణమైన రోజు. కేవలం ఒక్క రోజులోనే భారత ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ సుమారు రూ.1.9 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ షేరు 7.4%, టీసీఎస్ 7% చొప్పున భారీగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లలో కూడా యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఈ దెబ్బకు కుప్పకూలాయి.

అయితే ఈ పతనాన్ని కొంతమంది మార్కెట్ నిపుణులు కేవలం టెంపరరీగా అభివర్ణిస్తున్నారు. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ.. ఏఐ వల్ల ఐటీ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళనతోనే ఈ అమ్మకాలు జరిగాయని తెలిపారు. కానీ భారత ఐటీ కంపెనీలు ఇలాంటి మార్పులను తట్టుకుని నిలబడగలవని, పాత పద్ధతుల నుంచి ఏఐ ఆధారిత పద్ధతుల్లోకి మారే సామర్థ్యం వాటికి ఉందని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం షేర్ల ధరలు తగ్గడాన్ని దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఒక మంచి అవకాశంగా భావించాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతానికి ఐటీ రంగంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ, భవిష్యత్తులో కంపెనీలు ఏఐ టూల్స్ ను తమ పనిలో ఎలా భాగం చేసుకుంటాయనే దానిపైనే వాటి మనుగడ ఆధారపడి ఉంటుంది. పనులన్నీ ఏఐ చేస్తే మరి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఏంటనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే కంపెనీలు కేవలం మానవ వనరులపైనే ఆధారపడకుండా, ఏఐ ప్లస్ హ్యూమన్ మోడల్‎లోకి మారితేనే లాభదాయకంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో కంపెనీలు పొందే కొత్త ప్రాజెక్టులను బట్టి ఈ ఏఐ ప్రభావం ఎంత ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది.

Tags:    

Similar News