ముమ్మారు తలాక్ చట్టం.. తొలికేసు నమోదు

Update: 2019-08-02 07:30 GMT

ఇటీవలే ట్రిపుల్ తలాక్ - 2019 చట్ట రూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ చట్టం కింద ఉత్తరప్రదేశ్ లో తొలి కేసు నమోదైంది. వరకట్నం ఇవ్వడం లేదని ఓ వ్యక్తి తన భార్యకు ముమ్మారు తలాక్ చెప్పాడు. దీంతో అతని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మధురలో చోటు చేసుకుంది. ఇక్కడి కోసి ప్రాంతానికి చెందిన జుమిరాత్ కు, మేవత్ ప్రాంతానికి చెందిన ఇక్రం కు కొన్నాళ్ళ క్రితం పెళ్లయింది. వీరి కుటుంబాల మధ్యలో కట్నం విషయమై గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలను గురువారం పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవడానికి పంచాయతీ పెట్టారు. అయితే, ఇక్రం వరకట్నం కింద లక్ష రూపాయలు ఇస్తేనే తన భార్యతో కాపురం చేస్తానని తేల్చి చెప్పాడు. దానికి ఆమె తల్లిదండ్రులు నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో నడిరోడ్డుపైనే ఇక్రం మూడుసార్లు తలాక్ చెప్పి, తన భార్యతో తనకు ఏ సంబంధమూ లేదని వెళ్ళిపోయాడు. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై ముస్లిం విహాహ హక్కుల పరిరక్షణ చట్టం - 2019 ప్రకారం ఇక్రం పై కేసు నమోదు చేసినట్టు మధుర ఎస్పీ షాలాబ్ మాథుర్ చెప్పారు. ఈ చట్టం ప్రకారం ముమ్మారు తలాక్ చెబితే నేరంగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయితే నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.



Tags:    

Similar News